భద్రాద్రి రామయ్య బంగారు వాకిలి పనులు ప్రశ్నార్థం

ఖమ్మం, ఆగస్టు 3 : దక్షిణభారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాస్థానం గర్భగుడిలో బంగారు వాకిలి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా బంగారు వాకిలి నిర్మాణం చేపట్టాలని భావించారు. దీని కోసం ప్రధానంగా ఎవరు ముందుకు వస్తారన్న విషయమై ఎదురుచూస్తున్న సమయంలో ఫిబ్రవరి 16న భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌ రామాలయాన్ని సందర్శించారు. ఈ సమయంలో ఆయన రామాలయంలో బంగారు వాకిలి నిర్మాణానికి అవసరమైన మొత్తాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మార్చి 10న 40 లక్షల రూపాయల చెక్కును దేవస్థానం అధికారులకు పంపారు. అయితే ఈ మొత్తంతో బంగారు వాకిలి పనులు పూర్తి చేయడం సాధ్యం కాదని, 50 లక్షల రూపాయలు ఇస్తామంటే అప్పటి దేవస్థానం ఈఓ 40 లక్షలు చాలంటూ లేఖ పంపడం వల్లే దాత శ్రీనివాసన్‌ 40 లక్షల రూపాయలు పంపారంటూ పాలకమండలి సభ్యులు గతంలో విమర్శించారు. కాగా అప్పటి నుంచి దేవస్థానం అధికారులు ఉత్సాహం చూపుతూ దీని కోసం దేవాదాయ శాఖ అనుమతి కోరారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బంగారు వాకిలి పనులు పూర్తి చేయాలని సూచించారు. దీంతో అధికారులు ఈ విషయంపై టీటీడీ అధికారులను సంప్రదించగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పనులు చేపట్టలేమని స్పష్టం చేసినట్టు సమాచారం. దేవస్థానం అధికారులు దాత సహాయంతోనే బంగారు వాకిలి పనులు చేపట్టాలని యోచనలో ఉన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో పనులుచేపట్టాలంటే ఇప్పటికే వారి వద్ద శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, దేవస్థానాల అభివృద్ధి పనులు టీటీడీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అవి పూర్తయిన తరువాతే భద్రాచలంలో బంగారు వాకిలి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఒక వేళ టీటీడీ అధికారులు బంగారు వాకిలి పనులు చేపట్టాలన్న పైన పేర్కొన్న దేవస్థానాల పనులు పూర్తవ్వాలంటే కనీసం 4 సంవత్సరాలు పడుతుందని అధికారుల తెలిపారు. ఈ క్రమంలో అంత భారీ మొత్తం దేవస్థానం వద్ద ఉంచడం కంటే దాతకే ఆ మొత్తాన్ని అందజేసి బంగారు వాకిలి పనులు స్వయంగా దాత పర్యవేక్షణలో చేయించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.