భయం వద్దు .. ఈశాన్యవాసులకు రక్షణ కల్పిస్తాం

వెనక్కి వచ్చి విధుల్లో చేరండి : హోంమంత్రి సబిత
హైదరాబాద్‌ / బెంగుళూరు, ఆగస్టు 18 (జనంసాక్షి ):
వదంతులతో సొంత రాష్ట్రానికి పరుగులు పెడుతున్న ఈశాన్య వాసులకు ఎలాంటి భయం లేదని పూర్తి రక్షణ కల్పిస్తామని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇచ్చాయి. అయినప్పటికి ఈశాన్య వాసులు తరలిపోవటం ఆగలేదు. శనివారం నాడు గౌహుతి స్టేషన్‌లో వరద ప్రవాహం వలే కనిపించింది. తట్టబుట్టా సద్దుకొని సొంత ఊరికి వస్తున్న గౌహుతి వాసుల్లో ఇంకా భయం వెంటాడుతూనే ఉంది. సొంతవూళ్ళకు వెళ్ళకపోతే తమపై దాడులు జరుగుతాయని వచ్చిన వదంతులతో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలతోపాటు తమిళనాడు నుంచి కూడా అస్సాం వాసులు వెళ్ళిపోతున్నారు. ఇప్పట ివరకు బెంగుళూరుకు మాత్రమే పరిమితమైన ఈ ప్రస్థానం కర్ణాటక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పాకింది. మైసూరు, మంగుళూరు, కొడగ జిల్లాల్లో నివాసం ఉంటున్న ఈశాన్య రాష్ట్రాల వాసులు రైళ్ళు బస్సుల ద్వారా బెంగుళూరుకు చేరుకుని, తమ స్వరాష్ట్రాలకు పయనమయ్యారు. బెంగుళూరు లో ఈశాన్య రాష్ట్రాల వారు దాదాపు 2.5లక్షలమంది ఉండగా 25వేల మంది తరలిపోయినట్టు హోంమంత్రి తెలియజేశారు. కాగా వీరిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈశాన్య వాసులు నివసిస్తున్న ప్రాంతాల్లో 600మంది రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సును కూడా రంగంలోకి దింపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా అస్సాం మంత్రితో కలిసి ఈశాన్య వాసులు నివసిస్తున్న ప్రాంతాలకు వెళ్ళి వారికి ఎలాంటి భయం లేదని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా శనివారం నాడు ఆమె ఐటి కంపెనీల యజమానులతో సమావేశం నిర్వహించి ఈశాన్య వాసులలో అభద్రతా భావం తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించారు. మీకు ఎలాంటి భయం లేదు. మీకు ఉద్యోగాలకు డోకా లేదు. వెంటనే తిరిగి వచ్చి ఉద్యోగాల్లో చేరండని ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో ఈశాన్య వాసులు నివసిస్తున్న ప్రాంతాల్లో పోలీస్‌ గస్తీ ఏర్పాటు చేసామని ఆమె వెల్లడించారు. ఏ చిన్న సంఘటన జరిగిన తమకు వెంటనే తెలియజేస్తే, వెనువెంటనే చర్యలు తీసుకుం టామని ఆమె భరోసా ఇచ్చారు. బెంగుళూర్‌లో ఐదుగురు అరెస్టు
ఈశాన్య రాష్ట్రాల వాసులలో భయాందోళన కలిగిస్తున్న వదంతులు, ఎస్‌ఎంఎస్‌లపై పోలీసులు దృష్టి సారించి ఐదుగురిని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుండగా బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లపై కేంద్రప్రభుత్వం నిషేదం విధించింది.