మండలిలో మొత్త ఖాళీ స్థానాలు 16
తొలుత మూడు స్థానాలకు ఎన్నికలు?
హైదరాబాద్,ఫిబ్రవరి18(జనంసాక్షి): తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు పూర్తిచేసి జాబితాను ఈ నెల 20న ప్రకటించనుంది. 40 స్థానాలున్న శాసనమండలిలో మార్చి చివరికల్లా 16 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ప్రస్తుతానికి రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక పట్టభద్రుల నియోజవర్గానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్టు సీఈవో రజత్‌కుమార్ తెలిపారు. దీనిని పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలున్నట్టు సీఈవో కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనమండలిలో ఖాళీ అయ్యే స్థానాల్లో ఎమ్మెల్యే కోటా కింద 7, స్థానిక సంస్థల కోటాలో 5, ఉపాధ్యాయ కోటాలో 2 స్థానాలు, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, మరొకటి గవర్నర్ కోటాలో ఉంది. మార్చి నెలాఖరుకు పదవీకాలం ముగిసే ఉపాధ్యాయ నియోజకవర్గాలైన మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్, వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గం, అలాగే పట్టభద్రుల నియోజకవర్గం మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంగనగర్ స్థానాల ఎన్నికలకు కసరత్తు పూర్తిచేసినట్లు ఈసీకి రాష్ట్ర సీఈవో ప్రతిపాదించారు. దీంతో ఈ స్థానాలకే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.