మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉన్నత విద్యాశాఖ, పౌర సరఫరాల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు కు పని చేసిన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీధర్ బాబుకు కీలకమైన శాఖను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రిగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రమాణం స్వీకారం చేయడంతో మంథని నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు నియోజకవర్గ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.