మణుగూరులో థర్మల్‌ కేంద్రం ఏర్పాటు చేయండి

ఖమ్మం, జూలై 27 : ఖమ్మం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇక్కడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అయోధ్య డిమాండు చేశారు. మణుగూరులో 65 సంవత్సరాల వరకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇక్కడ థర్మల్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు యువతీ యువకులకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. లేదా సింగరేణికి అప్పగించాలన్నారు. బయ్యారం గనులను రహస్యంగా కొందరికి అప్పగించారని, దాన్ని అసెంబ్లీలో అప్పటి మణుగూరు ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రద్దు చేసేందుకు కృషి చేశారన్నారు. సింగరేణి జిఎంను కలిసి ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేసేందుకు పబ్లిక్‌ హియరింగ్‌లో తీర్మానం చేసేలా చూస్తామన్నారు. పినపాక మండలంలోని కుంచుబొంత ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టాలని డిమాండు చేశారు. అంతేకాకుండా కిన్నెరసాని రిజర్వాయర్‌, ఎడమ కాల్వ పనులను కూడా పూర్తి చేయించాలన్నారు. ఆరుగాలం కష్టించి రైతులు పండించే పంటకు నీరులేక రైతులు అవస్థలు పడుతున్నారని, కిన్నెరసాని పనులు ఆగిపోయాయని, వాటిని పూర్తి చేయాలని డిమాండు చేశారు.