మత సామరస్యానికి ప్రతీకగా నిలువాలి

 

* కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ
కరీంనగర్ బ్యూరో జనం సాక్షి :
వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కుల, మత, వర్గ, విభేదాలను విడినాడి సోదరభావంతో మెదులుతూ మతసామరస్యానికి ప్రతీకగా నిలువాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి గోవదలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
బుధవారం నాడు కమిషనరేట్ కేంద్రంలో శాంతికమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ గోవదలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా కమిషనరేట్ వ్యాప్తంగా చెక్పోస్ట్ లను ఏర్పాటు చేశామని, ఈ చెక్ పోస్ట్ ల వద్ద రేయింబవళ్లు తనిఖీలను కొనసాగిస్తున్నామని చెప్పారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని కోరారు. గోవుల అక్రమ రవాణా జరుగుతున్నదనే అనుమానంతో వాహనాలను తనిఖీ చేసి ఘర్షణ పూర్వతమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సోదర భావంతో మెదులుతూ పలు ఉత్సవాల్లో పాల్గొంటూ మతసామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారని, ఇది ఆహ్వానించ తగిన పరిణామమని అభినందించారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల దారి మళ్లింపు చర్యలు తీసుకోనున్నమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు విధులను నిర్వహిస్తున్న పోలీసులకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ వంతు సహకారం అందజేయాలని కోరారు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా నే కాకుండా ప్రతిరోజు తెల్లవారుజాము పోలీసులు ప్రార్థన స్థలాల వద్ద తనికీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రాంతాలతో పాటు కొన్ని సునితమైన, అనుమానాస్పద ప్రదేశాలలో తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రతి కదలిక నిఘా ఉంటుందని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సృష్టించే పుకార్లను నమ్మవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి వివిధ వర్గాలకు చెందిన ప్రజల్లో విభేదాలను సృష్టించే ప్రయత్నం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి పుకార్లు షికారులు చేసినా ప్రజలు ఆందోళన చెందకుండా సంయమనంతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఎల్అండ్ఓ) ఎస్ శ్రీనివాస్, ఎసిపిలు కరుణాకర్ రావు, విజయకుమార్, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, శాంతికమిటీ సభ్యులతోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.