మనస్థాపానికి గురై ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: కాన్పూర్ ఐఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వడితె నెహ్రూ నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెహ్రూ కాన్పూర్ ఐఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలో నెహ్రూ ఉత్తీర్ణత సాధించ లేకపోయాడు. నల్గొండ జిల్లా పెద్దఅడిసెర్లపల్లి మండలం మాలింగతండాకు చెందిన వడితె వెంకటరమణ కుమారుడు నెహ్రూ. నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన అతడు రెండు రోజుల తరవాత కాన్పూర్ వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కాన్పూర్ వెళ్ల కుండా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం నెహ్రూ కాన్పూర్ వెళ్లలేదన్న విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. తాను కూకట్‌పల్లిలో ఉంటున్న విషయం ఇంటివద్ద తెలియడంతో నెహ్రూ మనస్థాపానికి గురై నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓ రియల్‌ఎస్టేట్ వెంచర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.