మెదక్‌ చర్చికి వందేళ్ల ఘన చరిత్ర

` సీఎంగా వస్తానన్నాను
` కృపవల్ల అలానే వచ్చాను
` చర్చి క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం రేవంత్‌
` చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని వెల్లడి
` మాది రైతు ప్రభుత్వం
` పేదలకు అనుకూలంగా నిర్ణయాలు
` వనదుర్గామాత ఆలయంలోనూ సీఎం ప్రత్యేక పూజలు
మెదక్‌,డిసెంబర్‌25(జనంసాక్షి):వందేళ్లు పూర్తిచేసుకున్న మెదక్‌ చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా మెదక్‌ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు విజ్ఞప్తి మేరకు మెదక్‌ చర్చి అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానని.. సీఎం హోదాలో మళ్లీ వస్తానని అప్పట్లో మాటిచ్చానని రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లలో దళిత, గిరిజన కైస్త్రవులకు అత్యధికంగా లబ్ది చేకూరుతుందన్నారు. ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10లక్షలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం వివరించారు. మెదక్‌ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏసు భక్తులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్‌ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్‌ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్‌ గుర్తుచేశారు.శతాబ్ది ఉత్సవాలు, భక్తులతో క్రిస్మస్‌ జరుపుకోవాలనే ఇక్కడకు వచ్చానని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని.. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకంలో దళితులు, గిరిజనులకు మేలు జరుగుతోందన్నారు. మెదక్‌ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పాల్గొన్నారు.కాగా.. మెదక్‌ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముందుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎంపీ రఘునందన్‌ రావు తదితరులు వన దుర్గాదేవిని దర్శించుకున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మెదక్‌ చేరుకున్న సీఎం రేవంత్‌.. అక్కడ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్‌ చర్చికి చేరుకున్నారు. అక్కడ చర్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఆపై అక్కడ నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు.కాగా సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మెదక్‌కు వచ్చే దారులన్నీ పోలీసులు మూసివేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో 40 నిమిషాల పాటు ప్రయాణికులు, వాహనదారులు నరకయాతన అనుభవించారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో పోలీసుల తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ను ఎందుకు ఆపారంటూ కొందరు ప్రయాణికులు, వాహనదారులు పోలీసులను ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి వచ్చాడు.. మాకు పై నుండి ఆదేశాలు ఉన్నాయి. మీ వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పోయే వరకు మేము వాహనాలను, నార్మల్‌ ప్రజలను అనుమతి ఇవ్వం అంటూ పోలీసులు తేల్చిచెప్పారు. పోలీసుల చర్యలతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదీ కాంగ్రెస్‌ పాలన అంటూ పెదవి విరిచారు. ఇక మెదక్‌ చర్చి వద్ద కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి వచ్చాడని చర్చి గేట్లు మూసివేశారు. దీంతో గేట్ల బయట వేలాది మంది క్రిస్టియన్లు గంటల తరబడి నిలబడిపోయారు. ఓ మహిళ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. పదేండ్ల కేసీఆర్‌ పాలనలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని, సీఎం రేవంత్‌ రెడ్డి వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఆమె మండిపడ్డారు.