మన సారు లేఖ ఇస్తే.. పార్టీని జేఏసీలో చేర్పిద్దాం !

ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొందాం శ్రీతెలంగాణ మార్చ్‌లో పాల్గొందాం..
‘దేశం’ తమ్ముళ్ల ఉవ్విళ్లు
హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) :
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో తెలంగాణపై స్పష్టమైన వైఖరిని తెలుపునున్నట్లు శుక్రవారం విశ్వసనీయ సమాచారం మీడియాకు తెలిసింది. ఈ విషయంలో ఆయన పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులతో కూడా చర్చిస్తున్నట్లు ఆ అసంపూర్ణ వార్త సారాంశం ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నాయకుల్లో మళ్లీ పునరుత్తేజం వచ్చినట్లయింది. ఈ మేరకు శుక్రవారం ‘తమ్ముళ్ల’లో పలు విధాలా చర్చలు ఊపందుకున్నాయి. ఇంతకాలం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కచ్చితమైన నిర్ణయం తెలుపకపోవడంతో ప్రజల్లో తిరుగలేక పోయామని, తమ అధినేత గానీ తెలంగాణకు అనుకూల నిర్ణయం ప్రకటిస్తే ఇక ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్నయ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చని భావిస్తున్నారు. అంతేగాకుండా, ఒకవేళ చంద్రబాబు గానీ తాము అనుకున్నట్లు నిర్ణయం తీసుకుంటే, తెలంగాణ రాష్ట్ర పోరాటానికి తాము తోచిన విధంగా ఉద్యమించవచ్చని, తెలంగాణలో తల ఎత్తుకు తిరగవచ్చని, తమను ఇంతకాలం ఉద్యమ ద్రోహులు అని ఆరోపించిన వారికి తగిన రీతిలో సమాధానం చెప్పవచ్చని టీటీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు నిరూపించుకునేందుకు టీజేఏసీలో చేరేలా తమ నాయకుని ఒప్పించాలని భావిస్తున్నారు. ఈ రకంగా గానీ జరిగితే సెప్టెంబర్‌ 30 జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ‘తెలంగాణ మార్చ్‌’లో కూడా ఉత్సాహంగా, నిర్భయంగా పాల్గొనే అవకాశ ముంటుందని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిణామాలన్నీ అనుకున్నది అనుకు న్నట్లుగా జరిగితే మళ్లీ టీడీపీ బలం పుంజుకోవడం ఖాయమని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఫలితంగా, తమ రాజకీయ భవిష్యత్తు కూడా తిరిగి వెలిగిపోయే అవకాశముందని చర్చోపచర్చలు చేశారు. టీటీడీపీ నాయకులు ఇంతగా కార్యాచరణ రూపొందించుకుంటున్నా, పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయంపైనే మొత్తం అధారపడి ఉంటుందని కొందరు సీనియర్లు వాదించగా, మరి కొంతమంది మాత్రం ఈసారి చంద్రబాబు టీటీడీపీ నాయకులను సంతృప్తి పర్చేలా నిర్ణయం తీసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.