నిప్పులు చిమ్ముతూ నింగికి..
జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్16 ప్రయోగం విజయవంతం..
` నిర్దేశిత కక్ష్యలోకి ‘నైసార్’
` భారత్ అమెరికా అంతరిక్ష సహకారంలో తొలి అడుగు
తిరుపతి(జనంసాక్షి):అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ‘నాసా, ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్’ భూపరిశీలన ఉపగ్రహం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్- షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 వాహక నౌక.. 2,393 కిలోల బరువున్న ‘నైసార్’ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో-నాసా కలిసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగానూ నిలిచింది. దీని కోసం నాసా 1.16 బిలియన్ డాలర్లను సమకూర్చగా.. భారత్ 90 మిలియన్ డాలర్లను ఇచ్చింది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు చేర్చిన అత్యంత శక్తిమంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఇది ఒకటిగా నిలిచింది.ఈ ఉపగ్రహాన్ని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ), నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతో నైసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్) అని పేరు పెట్టారు. వివిధ పరిశోధనల్లో కొత్త ఒరవడిని ఇది తీసుకురానుంది. రెండు సింథటిక్ అపర్చర్ రాడార్లు (సార్) అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే.
భారత్-అమెరికా బంధానికి చిహ్నం
ఇస్రో-నాసా కలిసి ప్రయోగిస్తున్న తొలి ఉపగ్రహం ఇదే. భారత్ అమెరికా అంతరిక్ష సహకారంలో దీనిని తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే యాక్సిమ్ మిషిన్ కింద భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా నైసార్ భవిష్యత్తులో ఇచ్చే సమాచారంతో పంటలు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, హరికేన్లను అంచనావేసి.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చు. దీని డేటా ఆధారంగా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందని నాసా వెబ్‌సైట్ పేర్కొంది. భూమి లోపల జరిగే మార్పులను అంచనా వేసి.. సిద్ధం కావచ్చు.
‘నైసార్’ ప్రత్యేకతలు..
ఈ రెండు రాడార్లు భారీ డిష్ ఆకారంలో ఉంటాయి. ఇవి భూమి పైకి మైక్రోవేవ్, రేడియో సంకేతాలు పంపి.. తిరిగివచ్చిన వాటిని విశ్లేషించి చిత్రాలను తయారుచేస్తాయి. ఈ యాంటీన్నా 12 చదరపు మీటర్ల వైశాల్యం ఉటుంది. దీనిని మడతపెట్టి అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇది భూమిపై దాదాపు 20 కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను చిత్రీకరించగలదు. ఇస్రోకు చెందిన రిశాట్ సిరీస్‌లో ఒక ‘సార్’ను అమర్చిన ఉపగ్రహాలు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్నాయి. నైసార్‌కు ఉన్న రెండు రాడార్లలో ఒకటి ఎల్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, మరొకటి ఎస్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీల్లో పనిచేస్తాయి. ఒకే ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేర్వేరుగా చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది. ఈ రాడార్లు పగలు, రాత్రి తేడా లేకుండా మేఘాలు, పొగ, వర్షం, పొగమంచులో స్పష్టంగా ఫొటోలను ఇవ్వగలవు. ఏకకాలంలో వందలాది అగ్నిప్రర్వతాల్లో మార్పులను గమనించవచ్చు. లి ఎల్-బ్యాండ్ రాడార్ ఫ్రీక్వెన్సీలో మైక్రోవేవ్ తరంగాలు ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ప్రసరిస్తాయి. అరణ్యాలు, ఎడారులు, మంచు ఖండాల్లో భూమిని చిత్రీకరించగలవు. ఇక ఎస్-బ్యాండ్ రాడార్‌లో తక్కువ వేవ్‌లెంగ్త్‌తో తరంగాలు ప్రసరిస్తాయి. ఇవి పంట పొలాలు, నీటి వనరులు వంటి వాటిని చిత్రీకరించగలవు. ఈ ఉపగ్రహం రోజుకు 80 టీబీ డేటాను సృష్టించగలదు. గతంలో ఇస్రో, నాసా ఏజెన్సీలు ప్రయోగించిన ఏ ఎర్త్ శాటిలైట్లూ ఇంత డేటాను అందించలేదు. ఈ డేటాను క్లౌడ్‌లో భద్రపర్చి పంపిణీ చేస్తారు. నైసార్ రాడార్లు ప్రతి 12 రోజులకు రెండుసార్లు భూమి మొత్తాన్ని కవర్ చేస్తాయి.