గొర్రెల కుంభకోణంలో ఈడీ సోదాలు
` హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ దాడులు
హైదరాబాద్(జనంసాక్షి):గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గొర్రెల పంపిణీతో రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు సుమారు రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు- గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కయి నిధులు స్వాహా చేసినట్లు- ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కొంత మంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు- రికార్డుల్లో చూపించి, ఆ నిధుల్ని ఈ ముఠా స్వాహా చేసింది. ఈ నిధుల్ని బినావిూ ఖాతాల్లోకి మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు- ఏసీబీ, ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలతో గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం ఈడీ రంగంలోకి దిగి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడం, ఇతర రాష్టాల్రకూ లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అందుకే మనీ లాండరింగ్ కేసుగా ఈడీ విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్ట్ చేశారు. గొర్రెల పంపిణీ విధివిధానాలు, ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ పథకాన్ని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలు చోటు-చేసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ తన దర్యాప్తులో గుర్తించింది.గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్ల నుంచే కొంతమంది అధికారులు, మధ్యవర్తులు కలిసి ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు- సమాచారం. అసలు లబ్ధిదారులకు నిధులు అందకుండా బినావిూ ఖాతాల్లోకి చేరినట్టు- ఆధారాలు లభించాయి. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు- రికార్డుల్లో చూపించి ఆ మొత్తాన్ని అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు- ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహరంలో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హస్తమూ ఉందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.