నేను జోక్యం చేసుకోకపోతే భారత్‌- పాక్‌ ఇప్పటికీ యుద్ధంలో ఉండేవి..:

` ఆపరేషన్‌ సిందూర్‌ చర్చల వేళ ట్రంప్‌ మళ్లీ అదే పాత పాట
వాషింగ్టన్‌(జనంసాక్షి):భారత పార్లమెంటులో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చ జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అదే పాత పాట పాడారు. తానే గనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే.. భారత్‌- పాకిస్థాన్‌లు ఈపాటికి యుద్ధంలో ఉండేవని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో కలిసి ఆయన స్కాట్లాండ్‌లో మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. ఇటీవల కాలంలో తాను ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను నివారించినట్లు చెప్పుకోవడం గమనార్హం.‘‘ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల కాల్పుల విరమణలు కొనసాగుతున్నాయి. నేనే లేకుంటే.. ఆరు పెద్ద యుద్ధాలు జరగుతుండేవి. ఇందులో భారత్‌- పాకిస్థాన్‌ ఘర్షణ అతిపెద్దది. ఎందుకంటే.. ఇవి రెండూ అణ్వస్త్ర దేశాలు. ఒకవేళ అణ్వాయుధాలు ప్రయోగించుకుంటే.. యుద్ధం విస్తరించడం, అణుధూళి వ్యాప్తి వంటి దారుణ పరిస్థితులు నెలకొనేవి. ఇరుదేశాల నేతలు నాకు చాలా బాగా తెలుసు. యుద్ధం చేసుకోవాలనుకుంటే.. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని చెప్పాను’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. భారత్‌- పాక్‌ల మధ్య తానే యుద్ధం ఆపానంటూ ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో అమెరికా పాత్ర లేదని భారత్‌ ఖండిస్తూ వస్తోంది. పార్లమెంటులో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 22 నుంచి జూన్‌ 17 వరకు ప్రధాని మోదీ, ట్రంప్‌ల మధ్య ఎలాంటి ఫోన్‌ సంభాషణ జరగలేదని తెలిపారు.