42శాతం రిజర్వేషన్‌ కోసం ఢల్లీికి అఖిలపక్షం

` 30న రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేద్దాం
` ఈడబ్ల్యూఎస్‌ 10%తో రిజర్వేషన్‌ 50% దాటింది
` బీసీల బాగు కోరేవాళ్లంతా మాతో కలిసి ఢల్లీికి రావాలి
` రిజర్వేషన్లకు భాజపా నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి.. ఢల్లీిలో అడ్డుకుంటున్నారు
` ఈ అంశంలో విజయం సాధించే వరకు అన్ని రకాలుగా పోరాడుతాం
` మంత్రివర్గసమావేశంలో కీలక నిర్ణయాలు
` మీడియా సమావేశంలో కేబినెట్‌భేటీ వివరాలు వెల్లడిరచిన మంత్రి పొన్నం
హైదరాబాద్‌: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు భాజపా నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి.. దిల్లీలో అడ్డుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్‌ కోరామని చెప్పారు. వరసగా మూడురోజులపాటు రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని పొన్నం తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కోరేవారంతా తమతో కలిసి దిల్లీకి రావాలని పిలుపునిచ్చారు.‘‘గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. గత ప్రభుత్వం వాటిని తగ్గించింది. రిజర్వేషన్ల పెంపు బిల్లును మేం మార్చి 30న రాష్ట్రపతికి పంపించాం. 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లతో 50శాతం కోటా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్‌కు అడ్డురాని 50శాతం కోటా బీసీల విషయంలో మాత్రమే ఎందుకు అడ్డువస్తుంది? బీసీ రిజర్వేషన్ల సాధనలో అన్ని పార్టీలు కలిసి రావాలని కోరుతున్నాం. సామదానభేదదండోపాయాలు అన్నట్లుగా అన్ని రకాలుగా పోరాడుతాం’’అని మంత్రి పొన్నం తెలిపారు.అంతకుముందు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సుమారు 5 గంటల పాటు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చించారు. గవర్నర్‌ వద్దకు పంపిన ఆర్డినెన్స్‌ అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో పాటు ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్థానికత అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించారు.స్థానికత అంశంపై స్పష్టత కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సమావేశం మధ్యలోనే ఏజీ సుదర్శన్‌రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని ఏజీకి మంత్రి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో ఈ మేరకు వాదనలు వినిపించాలని సూచించారు. అవసరమైతే సీనియర్‌ న్యాయవాదుల సహకారం తీసుకోవాలని మంత్రి కోరారు.స్థానికులకే మెడికల్‌ సీట్లు దక్కేలా ప్రభుత్వం గతేడాది జీవో 33ను తీసుకొచ్చింది. అయితే స్థానిక కోటా సీట్లు తమకూ ఇవ్వాలని ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వచ్చేనెల 5న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు మంత్రి, ఏజీని కలిసి, స్థానిక విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు.