కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు
` 100కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం
` ఆపరేషన్ సిందూర్ భారత్ సత్తాకు నిదర్శనం
` మన సైనిక సత్తాను ప్రపంచమంతా గుర్తించింది
` ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఉగ్రమూకలపై దాడి
` పాక్ దాడిని ప్రతిదాడితో ఘోరంగా దెబ్బతీసాం
` మన సైన్యం నిర్వహించిన పాత్ర అమోఘం
` లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో రాజ్‌నాథ్ సింగ్
` ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశాం
` భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణలో ట్రంప్ ప్రమేయం లేదు: జై శంకర్
` పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా రాగలిగారు?
` ఆపరేషన్ సిందూర్‌పై అనేక సందేహాలు ఉన్నాయి
` ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాలి
` పాక్ పన్నాగాలను సాగనివ్వకూడదు
` కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
న్యూఢల్లీి(జనంసాక్షి):ఆపరేషన్ సిందూర్ భారత్ సత్తాకు నిదర్శనమని, మన వీరజవాన్ల పాత్ర వెలకట్ట లేనిదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి మన సత్తా చాటామని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారంనాడు ప్రత్యేక చర్చను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మిలటరీ యాక్షన్ చేపట్టింది. దీనిపై ప్రత్యేక చర్చలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటూ, కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశామని చెప్పారు. పహల్గాం దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని రాజ్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇందుకు ప్రతిగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై వ్యూహాత్మకం గా దాడి చేశామని, 9 ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టు-బెట్టిందని సభకు తెలిపారు. పాక్‌లో సామాన్యులకు ఇబ్బంది లేకుండా దాడులు చేశామన్నారు. సిందూర్ అనేది వీరత్యం, శౌర్యానికి ప్రతీక అని అభివర్ణించారు. ఉగ్రవాద శిబిరాలు, వారి మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని వారిని మట్టు-బెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టామని అన్నారు. ఆత్మరక్షణ కోసమే సైనిక చర్య తీసుకున్నామని, రెచ్చగొట్టడానికో, విస్తరణవాదంతోనే కాదన్నారు.మే 10వ తేదీన సుమారు 1.30 గంటలకు కూడా ఇండియాపై క్షిపణలు, డ్రోన్లు, రాకెట్లు-, ఇతర సుదీర్ఘ శ్రేణి ఆయుధాలపై దాడులకు పాక్ తెగబడిరదని చెప్పారు ఎస్-400, ఆకాశ్ మిజైల్ సిస్టమ్ పూర్తిగా పాక్ దాడులను విఫలం చేశాయని అన్నారు. పాకిస్థాన్‌లోని పలు వైమానిక కేంద్రాలపై భారత వాయిసేన భీకరంగా విరుచుకు పడటంతో పాకిస్థాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇచ్చేందుకు కేవియట్‌తో ఆమోదించామని తెలిపారు. భవిష్యత్తులో పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ఆపరేషన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.
ముందుగా నిర్ణయించిన రాజకీయ, మిలటరీ లక్ష్యాలు నెరవేరడంతో ఆపరేషన్ సింధూర్‌కు విరామం ఇచ్చిందని, ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనేదే పూర్తిగా తప్పని వివరించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా ఉండేందుకే తాను ప్రయత్నించానని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎన్ని విమానాలు కూలిపోయాయంటూ కొందరు విపక్ష సభ్యులు ప్రశ్నించారని, అయితే ఆ ప్రశ్న మన జాతీయ భావోద్వోగాలకు ప్రతిబింబించేదిగా లేదని తాను భావిస్తున్నానని రాజ్‌నాథ్ చెప్పారు. ఎన్ని శత్రు విమానాలను కూల్చేశారని మాత్రం విపక్షాలు ప్రశ్నించ లేదన్నారు. ఉగ్రవాద శిబిరాలను కూల్చేశారా అని తప్పనిసరిగా వాళ్లు ప్రశ్నించి ఉంటే దానికి అవునన్నదే తన సమాధానమని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా అని అడగవచ్చని, అందుకు అవునన్నదే తన సమధానమని అన్నారు. మన సాహస జవాన్లు ఎవరైనా మరణించారా అని అడిగితే లేదన్నదే తన సమాధానమని అన్నారు. మన సైనికులెవ్వరికీ ఎలాంటి హాని జరగలేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. రాజ్‌నాథ్ ప్రసంగిస్తున్న సేపు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచారు. పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్థాన్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నాం. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వినలేదు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి, ఆలోచించి ప్రశ్నలు అడగాలన్నారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలి. ఆనాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించాయి. మన సైనికుల చర్యను వాజ్‌పేయీ ప్రశంసించారు. 1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్‌పేయీ లాహోర్ యాత్ర చేపట్టారు. పాకిస్థాన్‌తో భారత్ స్నేహం కోరుకుంటోందని ఆనాడు వాజ్‌పేయీ చెప్పారు. స్నేహ హస్తం చాచడమే భారత్ గొప్పతనం. ఆనాడు వాజ్‌పేయీ తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్ మర్నాడు సూర్యోదయం చూసేది కాదు. శాంతి కోరడం భారత్ రక్తంలోనే ఉంది. యుద్ధాలు కోరుకోం. ప్రతి విషయాన్ని మానవత్వ కోణంలో ఆలోచిస్తాం. తుపాకులు పేలితే ఎవరూ మిగలరని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ అధికారులు పాల్గొన్నారు. దీనిని బట్టి వారిని ఆ దేశం ఎలా పెంచి పోషిస్తుందో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు మనం ఎవరిపైనా దాడి చేయలేదు. పాకిస్థాన్ చరిత్ర, అక్కడి ఉగ్రవాదం గురించి తెలుసుకొని మాట్లాడాలి. మనిషి.. నీతి, నిజాయతీతో బతకాలని తులసీదాస్ దోహాలో చెప్పారు. భారత స్నేహహస్తాన్ని పాక్ అందుకోలేకపోయింది. మనదేశ ప్రజలను చంపుతుంటే సైన్యం చూస్తూ ఊరుకోదు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం.. ఆ దేశానికే ఇబ్బందిగా మారుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశాం: జై శంకర్
‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశామని విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రపంచమంతా ముక్తకంఠంతో నినదించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడారు. భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణను కుదర్చడంలో ట్రంప్ ప్రమేయాన్ని కొట్టిపారేశారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని మోదీ, ట్రంప్‌ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేశారు.‘‘ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌లోని బహావల్‌పుర్, మురిద్కేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తామని ఎవరైనా ఊహించారా?పాక్ ఎదురుదాడులను సమర్థంగా అడ్డుకున్న తర్వాత.. ఆ దేశం దాడులను నిలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాకు ఫోన్లు వచ్చాయి. కానీ.. డీజీఎంవో నుంచి ఈ మేరకు విజ్ఞప్తి రావాలని స్పష్టం చేశాం. పహల్గాం ఉగ్రదాడికి తామే బాధ్యులమని ప్రకటించిన ‘టీఆర్‌ఎఫ్’ను అమెరికా అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ప్రకటించింది. దీనికి కృషి చేసిన అధికారులకు అభినందనలు. పహల్గాం ఘటనను ఐరాస భద్రతామండలి, క్వాడ్, బ్రిక్స్‌తోపాటు జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక దేశాలు ఖండిరచాయి. ఐరాసలోని 193 దేశాల్లో మూడు మాత్రమే పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నాయి’’ అని జైశంకర్ తెలిపారు.పాక్, చైనాల పరస్పర సహకారం ఇప్పటిది కాదని.. 60 ఏళ్లుగా కొనసాగుతోందన్న అంశాన్ని ఆయన తెలిపారు. చైనాతో వ్యవహరించాల్సిన తీరుపై ప్రతిపక్షాలు ఉపన్యాసాలు ఇస్తున్నాయని.. కానీ, 2జీ, 3జీ సాంకేతికతలను ఆ దేశం నుంచే తీసుకున్నాయని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వ హయాంలోనే పాకిస్థాన్ ఎక్కువ కాలం ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉందన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకో, లేదా రహస్య ఒప్పందాలు చేసుకోవడం కోసమో ఇటీవల చైనాకు వెళ్లలేదని, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టం చేసేందుకు, ఉద్రిక్తతలను తగ్గించేందుకే వెళ్లినట్లు చెప్పారు.
పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా రాగలిగారు?కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
పాక్ కుట్రలను సాగనివ్వకూడదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై అనేక సందేహాలు ఉన్నాయని అయితే ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాలని కోరారు.ఆపరేషన్ సిందూర్‌పై రాజ్‌నాథ్ అనేక విషయాలు చెప్పారన్న ఆయన.. పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా రాగలిగారో చెప్పలేదన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా గౌరవ్ గొగోయ్ మాట్లాడారు. ‘’ పహల్గాంకు ఉగ్రవాదులు వచ్చి ఎలా దాడి చేయగలిగారో రాజ్‌నాథ్ చెప్పలేదు. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు మేం తప్పకుండా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ప్రభుత్వం వాటికి కచ్చితంగా సమాధానం చెప్పాలి. భారతీయులు ఏకతాటిపై ఉండి పాకిస్థాన్ దురుద్దేశాలను సాగనివ్వకూడదు. ఉగ్రవాదులు పారిపోయేలా మనం చేశామా? లేదా? అన్నది చెప్పాలి. ఉగ్రదాడిలో చనిపోయిన వ్యక్తి భార్య తన ఆవేదన వెళ్లగక్కారు. తన భర్త మృతదేహంపై రాజకీయాలు కోరుకోవట్లేదని ఆమె చెప్పారు. మన సమాజం విభేదాలతో విచ్చిన్నం కావాలని పాక్ కోరుకుంటోంది. ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని రాహుల్ గాంధీ కూడా చెప్పారు. పాకిస్థాన్‌కు మాత్రం భారత్ తరఫున గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయి 100 రోజులు గడిచింది. ఇప్పటివరకు దాడికి కారకులను ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. మారణకాండకు పాల్పడిన తర్వాత ఉగ్రవాదులు కొందరి సహకారంతో పరారయ్యారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చిన వారి గురించి సర్కారు వద్ద జవాబు లేదు. శాటిలైట్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఇంత ఉన్నా ఉగ్రవాదులను పట్టుకోలేకపోయారు. ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత జమ్ముకశ్మీర్ సురక్షితంగా మారిందన్నారు. ప్రభుత్వ హామీతో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి మొదలైంది. అంతలోగా ఈ దారుణం చోటు చేసుకోవడం దురదృష్టకరం. ‘’ అని గొగోయ్ అన్నారు.