మమత మాకే ఓటేస్తారు

న్యూఢిల్లీ, జూలై 14 : బెంగాల్‌ ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎటువైపు మొగ్గుచూపుతారనే సందిగ్ధం ఇంకా వీడలేదు. మమతా మాత్రం యూపీఏ బలపరిచిన ప్రణబ్‌, అన్సారీలకే ఓటు వేస్తారని భావిస్తున్నట్టు పశ్చిమబెంగాల్‌ ఏఐసీసీ ఇన్‌చార్జి షకీర్‌అహ్మద్‌ శనివారం నాడు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పశ్చిమబెంగాల్‌ సెంటిమెంట్‌ను మమతా తోసిపుచ్చలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ప్రణబ్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచే యూపీఏ భాగస్వామ్య పక్షాలకు జూలై 18న సోనియాగాంధీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మమతా బెనర్జీని అహ్వానించగా, ఆమె ఆహ్వానాన్ని తోసిపుచ్చింది. ఆ రోజు పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ర్యాలీకి హాజరవుతున్న దృష్ట్యా సోనియా ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు చెబుతున్నప్పటికీ కావాలనే దీదీ విందుకు గైర్హాజరు అవుతున్నట్టు తెలిసింది. కాగా శనివారం నాడు జరిగే యూపీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్‌లో ఉపరాష్ట్రపతిగా అన్సారీ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది.