మరుగుదొడ్లలో మంచినీటి వసతికి రూ.28.50 కోట్ల నిధులు మంజూరు

సంగారెడ్డి, జూన్‌ 13 : మరుగుదొడ్ల నిర్మాణంలో నీటి వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.28.50 కోట్ల రూపాయలను మెదక్‌ జిల్లాకు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం నాడు స్థానిక జికేఆర్‌ గార్డెన్‌లో జరిగిన ఇంటింటా పారిశుద్ద్యం,మరుగుదొడ్ల, నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌ చేసే శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో మెదక్‌ జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామాలకు మంచినీరు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 28.50 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధుల మంజూరులో రాజకీయ, కులపరంగా కాని, జనాభా పరంగా కేటాయింపులు జరుగవని తెలిపారు. ఆన్‌లైన్‌ అప్‌డేటింగ్‌ వల్ల నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. గ్రౌండింగ్‌ చేయని మండలాలు తొందరగా గ్రౌండింగ్‌ చేయాలని సూచించారు. వచ్చే సంవత్సరం ఈ పథకంలో మార్పులు తెచ్చి యూనిట్‌ కాస్టు పెంచడంతో పాటు డిజైనింగ్‌లో మార్పులు చేసి బాత్రూం, వాటర్‌ కంపోనెంట్‌ మరుగుదొడ్డితో తప్పని సరిగా నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. 192 గ్రామాలల్లో వంద శాతం పూర్తయిందని తెలిపారు. అందోల్‌ మండలానికి 24 పథకాలకు 2.50 కోట్లు, మెదక్‌ మండలం 13 గ్రామాలలో 17 పథకాలకు 1.20 కోట్లు, నర్సాపూర్‌ మండలంలో 25 గ్రామాలకు 34 పథకాలకు 4.64 కోట్లు, పటాన్‌ చెర్వు మండలంలో 26 గ్రామాలకు 26 పథకాలకు 3.44 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్బ్యుఎస్‌ఈ సురేష్‌కుమార్‌, ఎసురత్నం, కార్పోరేషన్‌ ఆంజనేయ శర్మ, ఆర్డీవో వనజాదేవి, మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు, తహశీల్దార్‌, రిటైర్డ్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.