మహబూబాబాద్‌ను తలపించిన విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 23 (జనంసాక్షి) : వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లా చేనేత దీక్ష ఆద్యంతం తీవ్ర  ఉద్రిక్తతల మధ్యన కొనసాగింది. ఆ పార్టీ నాయకులు ప్రసంగిస్తున్నంత సేపు తెలంగా ణవాదుల నిరసనలతో హోరెత్తింది. నాయకుల ప్రసంగాలకు తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుత గిలారు. సభా ప్రాంగణంలో వందలాది మంది పోలీసులు, డిస్ట్రిక్ట్‌ గార్డుల పహారా మధ్య  విజయమ్మ దీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే తెలంగాణవాదులు, మహిళలు జైతెలంగాణ నినాదాలు చేస్తూ, సభాప్రాంగణంలోకి దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు తెలంగాణవాదులకు మధ్య పెనుగులాట జరగడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కాగా మహిళలని కూడా చూడకుండా పోలీసులు వారిని ఈడ్చివేయడంతో పలువురు సొమ్మసిల్లిపడి పోయారు. ఓ వైపు సభాప్రాంగణమంతటా తెలంగాణవాదులు తమ నిరసనలు తెలియజేస్తున్నా విజయమ్మ తన ప్రసంగాన్ని ప్రారంభించడంతో  ఎప్పుడేం జరుగుతుందోనన్న తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా సోమవారం నాడు సిరిసిల్లలో జరిగిన విజయమ్మ చేనేత దీక్ష సందర్భంగా వేములవాడ నుంచి సిరిసిల్ల వెళ్లే రహదారిలో అడుగడుగునా వాహనదారులను పోలీసులు తనిఖీ చేశారు.