మహిళా సంఘాలకు దండిగా చెక్కులు


వడ్డీ లేని రుణాల కింద రూ. 5 కోట్ల 37 లక్షలు మంజూరు
వీణవంకలో పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ రావు
హుజూరాబాద్‌,అగస్టు11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గం వీణవంక మండలంలోని మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసింది. ఈ మేరకు చెక్కులను మహిళా సంఘాలకు మంత్రి హరీశ్‌రావు అందించారు. స్వశక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 5 కోట్ల 37 లక్షలు మంజూరు చేశారు. స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ. 10 వేల కోట్లు, జీవనజ్యోతి మండలా సమాఖ్య(స్త్రీ నిధి)కు రూ. 4 కోట్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ అభివృద్ధికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉంటామని మహిళలు ఉద్ఘాటించారు. చెక్కులను అందుకోవడం సంతోషంగా ఉందని మహిళలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మిస్తామని తెలిపారు. మహిళా భవనాల కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడిరచారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌ ఇస్తున్నట్లు చెప్పారు. 57 ఏండ్లకే పెన్షన్‌ అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. అభయహస్తం డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇస్తామన్నారు. అభయహస్తంతో సంబంధం లేకుండా రూ.2 వేల పెన్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.