మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు

` 19న బడ్జెట్‌..` 17,18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ
` బీఏసీ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి 27 వరకు జరుగుతాయి. 14న హోలీ, 16న ఆదివారం, 20, 23న సెలవులు ఉన్నాయి. ఈ నాలుగు రోజులు మినహాయించి 12 రోజులు సమావేశాలు జరగబోతున్నాయి. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొంటారని కెటిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. అటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును 15వ తేదీన ప్రవేశపెట్టబోతోంది. 17, 18వ తేదీల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. కీలకమైన బడ్జెట్‌ ను 19వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెడుతారు. 20వ తేదీన సెలవు కాబట్టి 21, 22వ తేదీల్లో బడ్జెట్‌ విూద చర్చిస్తారు. 24 , 25, 26వ తేదీల్లో పద్దులపై చర్చలు జరుపుతారు. చివరగా 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెడుతారు. ఈ సమావేశాలు అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం బీసీలంతా ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లులో బీసీ రిజర్వేషన్ల కోటాపై స్పష్టత వస్తే కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. అంతే కాకుండా కేసీఆర్‌ ఓడిపోయిన తర్వాత మొదటిసారి అసెంబ్లీలో ప్రసంగించబోతున్నారు. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానాలు చెప్పాలని రేవంత్‌ ప్రభుత్వం కసరత్తులు స్టార్ట్‌ చేసింది. కాబట్టి గతంలో జరిగిన సమావేశాల కంటే ఈ సమావేశాలు మరింత వేడెక్కడం ఖాయం. స్పీకర్‌ గడ్డం ప్రసాదకుమార్‌ అధ్యక్షతన జరిగిన బిఎఎసి సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై చర్చించారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఛాంబర్‌లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. గురువారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. దానిపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అలాగే 14న హోలీ పండుగ నేపథ్యంలో సెలవు ప్రకటించారు. 16న ఆదివారం. 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చించనున్నారు. 18న బీసీ కులగణన, రిజర్వేషన్లపై చర్చ జరుగనుంది.21నబడ్జెట్‌పై చర్చించనున్నారు. అలాగే మూడు రోజుల పాటు పద్దులపై చర్చ జరుగనుంది. 27న ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. దాదాపు 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. కనీసం 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్‌ దృష్టికి బీఆర్‌ఎస్‌ నేతలు తీసుకెళ్లారు. అయితే ఈనెల 27 వరకు సభను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, బిజెపి నుండి మహేశ్వర్‌ రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్‌ ఓవైసీ హాజరయ్యారు.