మీడియాలో వెలుగు చూడని మా’రాజు’ సేవ

గోకుల్‌చాట్‌ పేలుళ్లలో క్షతగాత్రులను రక్షించేందుకు అసమాన తెగువ
తెలంగాణ జర్నలిస్టు సేవకు గుర్తింపునివ్వని సీమాంధ్ర మీడియా
కొత్తతరం జర్నలిస్టులకు కరీంనగర్‌ బిడ్డ అల్లూరి సీతారామారాజు ఆదర్శం
హైదరాబాద్‌, జనవరి 27 (జనంసాక్షి) :
ఎవరెటు పోతే మాకేంటి స్కోరింగ్‌ కొట్టామా? లేదా? అన్నది ప్రస్తుత మీడియా ప్రతినిధుల ధోరణి. ఎలక్ట్రానిక్‌ మీడియా విస్తృతి పుణ్యమా అని పాత్రికేయులు మానవీయ విలువలకు 90 శాతం తిలోదకాలిచ్చారన్న వాదనతో అందరూ ఏకీభవించాల్సిందే. ఇందుకు నిదర్శనలెన్నో ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదంలోనో, ప్రకృతి వైపరీత్యాల్లోనో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని వివరాల కోసం గుచ్చిగుచ్చి ప్రశ్నించడం తెలుగు మీడియా ప్రతినిధులకే చెల్లింది. ఖూనీకోర్లను, కబ్జా రాయుళ్ల ఇంటర్వ్యూలు ప్రసారం చేయడం, వారికి లేని హైప్‌ ఇవ్వడం, పొద్దంతా చూపించిన దాన్నే చూపించి ప్రేక్షకులను విసిగించడం మన ఎలక్ట్రానిక్‌ మీడియాకే చెల్లింది. వార్తల ప్రసారంలోనూ ఎవరికి వారు గిరి గీసుకొని ఆ గీతలకు లోబడే ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న తరుణంలోనూ ఈ ప్రాంత జర్నలిస్టులకు సీమాంధ్ర పెత్తందారి మీడియాలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. అమానవీయ జర్నలిజంలో మానవత్వం పరిమళించేలా… బాంబు దాడిలో నెత్తుటి ముద్దల్లా కొన ఊపిరితో ఉన్న శరీరాలను స్వయంగా ఆస్పత్రికి తరలించినా కనీసం ఆ దృశ్యాలను కూడా సదరు మీడియా ప్రసారం చేయలేదంటే వారి ఆధిపత్య ధోరణి ఎంతో అర్థం చేసుకోవచ్చు. అదే మీడియా తమ సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులు ఏ చిన్నపని చేసినా ఏదో ఘనకార్యం చేసినట్టు ప్రచారం కల్పించుకుంటోంది. కానీ తెలంగాణకు చెందిన ఓ జర్నలిస్టు హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన కోఠీ సమీపంలోని గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్లలో గాయపడ్డ వారిని స్వయంగా ఆస్పత్రికి తరలించినా ఒక్క బులిటెన్‌లోనూ ఆ దృశ్యాలను ప్రసారం చేయలేదు. ఓ పక్క బాంబులు పేలుతున్నా ప్రాణాలకు తెగించి క్షతగాత్రులను కాపాడాలని ఆయన చేసిన ప్రయత్నాలను అభినందించనూ లేను. బాంబు పేలుళ్ల ధాటికి శరీరంలో అవయవాలు తెగిపడి, కొన ఊపిరితో రక్తమోడుతున్న వారిని చూసి తమకూ ఆ పరిస్థితి రాకూడదని సమీపంలో ఉన్నవారంతా అక్కడ్నుంచి పారిపోతున్న తరుణంలో అంకితభావంతో వృత్తి ధర్మాన్ని, మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్టు తెగింపును కనీసం బాహ్య ప్రపంచానికి తెలపడానికి ఇష్టపడలేదు మీడియాలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఆ సంస్థ. మీడియా అంటే ఏహ్యభావం, మీడియా ప్రతినిధులంటే భయం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వారికి కనీసం ప్రాచుర్యం కల్పించకపోవడాన్ని ఏమనాలి. ఈ మధ్య మీడియాలో పెడ ధోరణులు మరింతగా పెరిగిపోయాయి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా బ్రేకింగులు వేస్తున్నాయి. వాటిని క్యాష్‌ చేసుకొని రేటింగులు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ మధ్య కరీంనగర్‌ జిల్లాలో ఓ మహిళ మరోకరితో వివాహేతర సంబంధం నెరుపుతుందని అందరూ కూడి చావబాదుతుంటే మీడియా కళ్లప్పగించుకొని చూసింది. ఎంచక్కా తమ కెమెరాల్లో బంధించి ప్రజలకు అదో వినోదంలా చూపింది. విచక్షణ రహితంగా కొట్టి దెబ్బలకు తాళలేక ఆ మహిళ కొద్ది రోజుల తర్వాత చనిపోయింది. అప్పుడే సదరు మీడియా ప్రతినిధులు రెచ్చిపోయి దాడి చేస్తున్న వారికి కాస్త సర్ధిచెప్పి ఉంటే నిండు ప్రాణాలు దక్కేవి. పలు సందర్భాల్లో వివిధ డిమాండ్లతో సెల్‌ టవర్లు, భవనాలు ఎక్కిన వారిని లైవ్‌లలో చూపించి ఇలాంటి ఘటనలను ప్రేరేపించింది. కొందరు భావోద్వేగానికిలోనై దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఈ చానెళ్ల బరితెగింపే కారణం. అలాంటి పరిస్థితుల్లో ‘గంజాయివనంలో తులసి మొక్క’లా ఓ యువ జర్నలిస్టు చేసిన అసమాన సేవకు ఎంతమాత్రం గుర్తింపు దక్కలేదు. ఇదే పని ఆ మీడియా సంస్థ నిర్వాహకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేస్తే ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దినపత్రికలో పతాక శీర్షికన ప్రచురించేది. అన్ని భాషల చానళ్లలోనూ ప్రముఖంగా ప్రసారం చేసేది. మంచిపని చేసే జర్నలిస్టులే కనుమరుగవుతున్న తరుణంలో ఐదున్నరేళ్ల క్రితం (2007 ఆగస్టు 25) హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కులో ముష్కరులు బాంబులు పేల్చి చాలా మందిని పొట్టన బెట్టుకున్నారు. పిల్లలతో, స్నేహితులతో సరదాగా పార్కుకు వెళ్లిన వారు, చాట్‌, ఐస్‌ క్రీమ్‌లు తినేందుకు వెళ్లిన అమాయకులు ఆ బాంబుల విస్ఫోటనానికి బలయ్యారు. అదే ప్రమాదంలో వందలాది మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకురాలేదు. వచ్చిన ఒకటి, రెండు అంబులెన్స్‌లు కొందరినే ఆస్పత్రికి తరలించాయి. ఆ సమయంలో వార్త కవరేజీకి వెళ్లిన ఈటీవీ 2 కరస్పాండెంట్‌ సీతారామారాజు అక్కడ తునాతునకలైన దేహాలను చూసి చలించిపోయారు. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఆపన్నహస్తం కోసం రోదిస్తున్న క్షతగాత్రులను స్వయంగా బయటికి తీసి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ప్రైవేటు వాహనదారులు ఆయనకు సహకరించకపోతే సిటీ బస్సును ఆపి అందులో క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారికి సత్వరం వైద్యం అందితే ప్రాణాలు దక్కుతాయనే విశ్వాసంతో ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకుసాగిన సీతారామరాజును ప్రతి మానవతావాది అభినందించి తీరాలి. కానీ ఆయన ఉద్యోగం చేస్తున్న మీడియా సంస్థ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇది నిజంగా అమానవీయం. ఒక ప్రాంతం ప్రజల ఆకాంక్షలను నొక్కి పెట్టడమే కాదు, ఆ ప్రాంత జర్నలిస్టుల అసాధారణ స్థాయిలో ఐటమ్స్‌ రిపోర్ట్‌ చేసినా కేవలం వార్త మాత్రమే ప్రసారం చేసి వారి తెగింపును, చొరవను తొక్కి పెట్టాలని చూడటం దారుణం. ఇప్పటికైనా సీమాంధ్ర పెత్తందారుల చేతుల్లో కేంద్రీకృతమైన మీడియా ప్రజల ఆకాంక్షలతో పాటు అసమైన ప్రతిభ చూపిన జర్నలిస్టులను తెగువకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టు సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.

తాజావార్తలు