ముఖ్యమంత్రి పర్యటనలో స్వల్ప మార్పులు

శ్రీకాకుళం, జూలై 25 : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందిరమ్మబాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 27 28,29 జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన ప్రకారం రణస్థాలం మండలంలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలన చేస్తారని, నరసన్నపేట మండలంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభోత్సవం చేస్తారని ప్రకటించారు. ఈ రెండు మండలాల పర్యటనను రద్దు చేసి, తాజా షెడ్యూల్‌ను జిల్లా అధికారులు ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయానికి పంపించారు. ఇదే దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం 27వ తేదీన ఉదయం 10గంటలకు శ్రీకాకుళం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహానికి చేరుకొని అనంతరం ఆమదాలవలస, బూర్జ, పాలకొండ, సీతంపేట మండలాల్లో పర్యటించి అదే రోజు రాత్రికి సీతంపేట మండలం మల్లీ ఆశ్రమ పాఠశాలలో రాత్రి బస చేస్తారు. 28న ఉదయం మల్లీ పాఠశాల నుంచి బయలుదేరి పాత పట్నం నందీగామం, శ్రీకాకుళం మండలాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ రాత్రికి శ్రీకాకుళం పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో రాత్రి బస చేస్తారు. 29న శ్రీకాకుళం రూరల్‌, అర్బన్‌లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొని అదే రోజు మధ్యాహ్నం 3.30కు ముఖ్యమంత్రి శ్రీకాకుళం నుంచి బయలుదేరి వెళ్లుతారు.