ముల్కీ అమరులే మనకు స్ఫూర్తి

ఘనంగా గన్‌పార్కు వద్ద టీజేఏసీ నివాళి
హైదరాబాద, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): ముల్కీ అమరులే ప్రస్తుతం సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని తెలంగాణ డాక్టర్ల జేఏసీ అధ్యక్షుడు డాక్టర్‌ నర్సయ్య వెల్లడించారు. మంగళవారం తెలంగాణ జేఏసీ, డాక్టర్ల జేఏసీ సంయుక్తంగా గన్‌పార్క్‌ వద్ద ముల్కీ అమరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్‌ నర్సయ్య, పిట్టల రవీందర్‌ మాట్లాడుతూ 50 ఏళ్ల కిందటే తెలంగాణ యువ కిశోరాలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను సీమాంధ్ర పాలకుల తూటాలకు బలిచ్చారని కొనియాడారు. నాడు ఏడుగురు తెలంగాణవాదులు తమ ప్రాణాలను కోల్పోయి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను చాటి చెప్పారని తెలిపారు. ఆ అమరుల స్ఫూర్తిగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మడమ తిప్పని పోరాటం చేద్దామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ నాయకులు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.