ముస్లింలకు ఇళ్ళ స్థలాలు ఒకే ప్రాంతంలో ఇవ్వాలి

సిపిఎం నాయకుడు మణి డిమాండ్‌
కడప, జూలై 30 : రైల్వే కోడూరు పట్టణంలో ముస్లింలకు సంబంధించి ప్రభుత్వం అందించాలనుకుంటున్న ఇళ్ళ స్థలాలను ఒకే ప్రాంతంలో ఇవ్వాలని సిపిఎం నాయకుడు మణి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నదని అన్నారు. నిరుపేదల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం రైల్వే కొడూరు ఎంఆర్‌ఒ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఆయన మాట్లాడుతూ నిరుపేదల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఇళ్ళ స్థలాలకోసం ధరఖాస్తులు చేస్తున్నారని చెప్పారు. వారందరికి ఒకే ప్రాంతంలో స్థలాలు ఇవ్వడం వల్ల వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. మైనారిటీ శాఖ, మైనారిటి సంక్షేమబోర్డు, మైనారిటి కార్పొరేషన్‌, వక్ఫ్‌బోర్డు తదితర సమస్యల నుంచి మైనారిటీలకు ప్రయోజనాలు చేకూర్చవచ్చనని చెప్పారు. అందువల్ల అధికారులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ధర్నాలో మైనారిటీలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.