మొక్కుబడిగా సమావేశాలు వద్దు

తెలంగాణపై నాన్చుడుధోరణి తగదు
– సీపీఐ నేత జి. మల్లేశ్‌
హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): రాష్ట్ర శాసనసభ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించి ప్రజాసమస్యలన్నింటిపై చర్చించాలని సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు జి. మల్లేశ్‌ డిమాండ్‌ చేశారు. మఖ్దూంభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం మొక్కుబడిగా ఒక రోజు సమావేశాన్ని నిర్వహించవద్దని, ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావం, కరువు పరిస్థితుల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నదని, వారి సమస్యలపై శాసనసభ చర్చించి, అండగా ఉన్నామనే ధీమాను రైతులకు కల్పించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా ప్రజలపై పన్నుల భారాన్ని మోపి సామాన్యుల నడ్డి విరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడుధోరణి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం వెంటనే తాత్సారం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాము తెలంగాణకు సంపూర్ణ మద్దతు ప్రకటించామని, రాష్ట్ర ఏర్పాటుకై ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.