రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు
నాణ్యమైన ధాన్యంతో రైతులు రావాలి
సొంతూరులో కొనుగులు కేంద్రం ప్రారంభించిన మంత్రి వేముల
నిజామాబాద్,అక్టోబర్21( జనం సాక్షి ): రైతుల మేలు కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని, నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు`భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తన సొంత గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గురువారం జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు వరికి మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి రూ.1960 సాధారణ రకానికి రూ.1940 ఇచ్చే విధంగా గురువారం నిజామాబాద్ జిల్లాలో 467 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో అక్కడి రైతులు 1200 నుంచి 1300 వందల రూపాయలకు పోటీలు పడి షావుకార్లకు ధాన్యం అమ్ముకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలును అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ రైతులకు మద్దతు ధర ఇప్పిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, సర్పంచ్ తీగల రాధ, ఎంపీపీ జమున, జెడ్పీటీసీలు భారతి, రాణి తదితరులు పాల్గొన్నారు.