రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం : చంద్రబాబు

్ణకృష్ణా : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా

చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి జిల్లాకు వచ్చిన ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో ఇప్పటివరకు అధికారులు పట్టించుకోకుండా సహాయక చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. తుపాను ధాటికి రాష్ట్రం విలవిల్లాడుతుంటే కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు సమర్పించాల్సిన అధికారులు పత్తాలేకుండా పోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ ఒక్క అధికారి కూడా సరిగా విధులు నిర్వహించడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎవరికీ భయం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రైతులను తక్షణమే ఆదుకొని వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గత ముప్పయి ఏళ్లుగా కలగని నష్టం నేటి తుపాను ప్రభావంతో జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కార్యాచరణ ప్రణాళిక ద్వారా  రైతుల నష్టాలు తీర్చాలని అన్నారు. రైతులకు పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని తెలిపారు.