రైతు సమస్యలు పట్టని మంత్రులు

కడప, జూలై 10 : జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జిల్లాకు చెందని మంత్రులు ఏ మాత్రం స్పందించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రైతు కన్వీనర్‌ ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. వర్షాలు లేక, విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతుల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని అన్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిందని చెప్పారు. అయితే పంటల భీమాను మాత్రం కొన్ని మండలాలకే చెల్లించారని ఆయన చెప్పారు. జిల్లా నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న రైతుల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని అన్నారు. రైతాంగ సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. రైతులు తాము చేపట్టేబోయే ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.