లైసెన్సుల వేలం ప్రక్రియపై గడువు అమలుకు హామీ

న్యూఢీల్లీ: రద్దయిన స్పెక్ట్రమ్‌ లైసెన్సులకు తిరిగి వేలం నిర్వహించటానికి మరింత గడువు కావాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం సనుకూలంగా స్పందించింది. గతంలో మంజూరు చేసిన 122 లైసెన్సులను (2జీ స్పెక్ట్రమ్‌) రద్దు చేసిన సుప్రీం కర్టు వాటికి వేలం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వానికి తొలుత జూన్‌ 2వ తేది వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో 400 రోజుల గడువు వావాలన్న టెలికాం మంత్రిత్వ శాఖ అభ్యార్థనను ధర్మాసనం తోసిపుచ్చుతూ ఆగస్టు 31వరకు గడవును పొడిగించింది. అయితే ఈ గడువూ సరిపోదని తెలుపుతూ నవంబరు 12 వరకు, లైసెన్సుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయటానికి మరో 40 రోజుల సమయమివ్వాలని టెలికాం మంత్రిత్వ శాఖ మళ్లీ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని విచారణకు చేపట్టిన ధర్మాసనం తాజాగా తమ తీర్పునకు కట్టుబడి, తామిచ్చే కొత్త గడువులోగా వేలం ప్రక్రియను పూర్తిచేస్తామని వాగ్దాన పత్రాన్ని సమర్పిస్తేనే ఆ పిటిషన్‌పై విచారణ కొనసాగిస్తామని శుక్రవారం స్పష్టం చేసింది. కొత్త గడువుకైనా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలనే తాము ఆశిస్తున్నామని ధర్మాసనం తెలిపింది.