లోక్యా తండాలో ఉధృతమవుతున్న జ్వరాలు

ఖమ్మం, అక్టోబర్‌ 18 : జిల్లాలోని కూచిమంచి మండలంలో గల లోక్యా తండాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని అన్ని వీధుల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. రోడ్లపై మురుగునీరు ప్రవహించి నిల్వ ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. తండాలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. తండాలో ఇటీవల ఉపాధ్యాయుడికి డెంగ్యూ వ్యాధి సోకినట్టు వైద్యులు నిర్ధారించగా మరికొందరు మంచం పట్టారు. గ్రామాల్లో సరైన మురుగు కాల్వల వసతులు లేక మురుగు నీరు రోడ్లపై ప్రవహించడం, తాగునీరు కలుషితం కావడంతో వ్యాధులు ప్రబులుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు. లోక్యా తండాలో కూచిమంచి  మండల వైద్యాధికారి శంకర్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.