వంటగ్యాస్‌ కార్లపాలు

ఖమ్మం, జూలై 25 : జిల్లా కేంద్రంలోని ఇళ్లలో వంటలు ఉడికించని గ్యాస్‌ కారు నడిచేందుకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం గృహ వినియోగానికి రాయితీపై పంపిణీ చేస్తున్న సిలిండర్లు నల్లబజారులో ఎంచక్క కార్లకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. పట్టణంలో ఈ దంద యధేచ్ఛగా సాగుతోంది. రాయితీపై సరఫరా చేస్తున్న ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్లు పక్కదారి వెళ్తున్నాయి. గృహ ఉపయోగ సిలిండర్లు దొడ్డిదారినపట్టి రెట్టింపు ధరకు నల్లబజారులో దర్శనమిస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌ ధర కారణంగా కార్ల వినియోగదారులు గ్యాస్‌ కిట్లను ఉపయోగిస్తున్నారు. అధిక శాతం అనుమతి లేకుండానే కార్లకు గ్యాస్‌ ఎక్కిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంతో పాటు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, మదిర, సత్తుపల్లి, అశ్వారావుపేట వంటి ప్రధాన పట్టణాల్లో బహిరంగంగా ఈ వ్యవహారం సాగుతున్నా కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని మెకానిక్‌ షెడ్లలో నాలుగు చోట్ల ఈ తంతు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ధర 402 రూపాయలు ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను నల్లబజారులో 600 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో దళారులకు కాసులవర్షం కురుస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గృహావసరాలకు సరైన విధంగా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.