వర్షాలకు 26 మంది మృతి : భారీగా పంట నష్టం

హైదరాబాద్‌ : నీలం తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలకు పలు కోస్తాంధ్ర జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో నష్టం భారీగా జరిగింది. పంటనష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు ఉభయగోదావరి, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. నీలం తుపాను కారణంగా నెల్లూరు, ప్రకాశం , చిత్తూరు జిల్లాల్లో పెనుప్రమాదం సంభవించింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలకు యంత్రాంగాన్ని రంగంలోకి దించామని పేర్కొన్నారు. ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నాం. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో వర్షాలకు 26 మంది మరణించారు. 5.52 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు ముంపునకు గురయ్యాయి. 24,332 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయి. వర్షాల్లో మొత్తంగా 1,274 ఇళ్లు దెబ్బతిన్నాయి. మత్స్యకారులకు చెందిన 2,180కిపైగా పడవలు, వలలు, ఇతర సామాగ్రి దెబ్బతిన్నాయి.