విజయమ్మకు ఆ హక్కు ఉందా…

అవును మనుషులకు సంచరించే హక్కు ఉంది. ప్రజాస్వామ్య దేశంలో అహక్కు రాజ్యాగం కల్పించింది. ఎక్కడి కైనా వెళ్లొచ్చు. వైయస్‌ అనుకున్నట్లుగా తెలంగాణలో తిరిగేందుకు పాస్‌పోర్టు, వీసా ఏమీ లేకుండానే తిరగొచ్చు. ఇక్కడి వీసా పాస్‌పోర్టులు అడగడం లేదు. జైతెలంగాణ అనమంటున్నారంతే. ప్రజాస్వామ్యమంటే కేవలం సంచరించే స్వేచ్ఛ మాత్రమే కాదు ప్రజల మనోభావాలను గౌరవించడం. దానిపై వైయస్‌ విజయమ్మకు కానీ, ఆమె కుమారుడికి కానీ పెద్దగా నమ్మకం ఉన్నట్లు ఎక్కడా కనబడదు. ఎందుకంటే ఆమె కుమారుడు ఓదార్పు యాత్ర పేరుతో తన కిరాయి మూకతో మహబూబాబాద్‌లో అడుగుపెట్ట్టే దుస్సాహసం చేశాడు. పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచాడు. అసలే పౌరుషానికి ప్రతీకలైన తెలంగాణ బిడ్డలు దీని సహించలేదు. దీంతో అప్రజాస్వామికంగా తన అర్దబలం, మందబలం చూపి తెలంగాణ తల్లి గుండెపై గాయాల గాటు పెట్టాడు. అది అక్కడితో ఆగలేదు. ఆర్మూర్‌లో చేపట్టిన రైతు దీక్ష సందర్భంగా కూడా వందలాది వాహనాలలో తన కిరాయి రౌడీలతో అడుగడుగునా భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించాడు. అక్కడ కూడా తెలంగాణ వాదులు తమ పౌరుషాన్ని చూపారు. వైయస్‌ జగన్‌ ఆయన పార్టీ నేతలు సినిమా షూటింగ్‌ను తలపించేవిధంగా చేపట్టిన రైతు దీక్ష

అసలు ప్రజలే లేక వెలవెలపోయింది. అయితే ఇపుడు చేనేత దీక్ష చేయాలని చూస్తున్న విజయమ్మకు  ఇక్కడి ప్రజల మనోభావాలు అర్థం కాలేదో లేక సీమాంధ్ర అధికారాన్ని ప్రదర్శించాలనుకుంటుందో ఏమో మరోసారి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలని చూస్తుంది. అయితే తెలంగాణ ప్రజలు మానుకోటను మరిచిపోలేదు. దాని స్పూర్తిగా మరోసారి చరిత్రపు పునరావృతం చేయాలని చూస్తున్నారు. ఉప ఎన్నికల సంర్భంగా తమ కొడుకుపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టారని కన్నీరు పెట్టిన విజయమ్మకు ఇక్కడ తల్లుల కన్నీళ్లు కనబడలేదనుకోవాలా? తెలంగాణ కోసం వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నా ఈ తల్లికి కనబడలేదా? వైయస్‌ హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయన్న విషయం విజయమ్మకు తెలియదా? అప్పుడెపుడూ గుర్తుకురాని తెలంగాణ ఇపుడెందుకు గుర్తుకు వచ్చిందన్నది ఇక్కడి ప్రజలు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ప్రజల మనోభావాలను గాయపర్చడం ప్రజాస్వామ్యం కాదు. వారి మనోభావాలు గౌరవిస్తూ అక్కడి ప్రజల ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా విజయమ్మ మనసు మారి ప్రజాస్వామ్యం అంటే అర్థం అయి ఇక్కడి ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఉద్యమానికి మద్దతివ్వాలి. లేకుంటే తెలంగాణ ప్రజలు వారిని ఇక్కడ అడుగుపెట్టనివ్వరు. అలాకాకుండా ప్రజలను గుండాయిజంతో లోబర్చుకోలేరు. మీకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణకు అనుగుణంగా చిదంబరానికి లేఖ ఇచ్చి తెలంగాణలో అడుగుపెట్టాలి.