విద్యాభివృద్ది లక్ష్యంగా ప్రైవేట్‌ సంస్థలు పనిచేయాలి

ఖమ్మం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): సహృదయంతో విద్యార్థులకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలలపై ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలో పేతం చేసిందన్నారు. ప్రైవేటు విద్యా వ్యవస్థ అంటే కేవలం డబ్బే ప్రధానం కాదన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అత్యున్నతమైన ప్రమాణాలతో విద్యనందించడం లక్ష్యం కావాలన్నారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థులకు క్రమశిక్షణను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రణాళికాబద్ధంగా విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలు లాభాక్ష లేకుండా నిర్వహించాలన్నారు. సింగపూర్‌ లాంటి చిన్నదేశం కూడా విద్యలో ప్రావీణ్యం ఉండటంతో అమెరికాతో సరి సమానంగా ఆర్థిక రంగంలో దూసుకుపోతుందన్నారు. మనిషికి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. విద్యార్థులు మార్కుల కంటే కూడా వారిలో ఎంత పరిజ్ఞానాన్ని పెంపొందించాలనే విషయమే ముఖ్యమన్నారు.