విద్యుత్‌ ఆదా చేయండి.. ఇష్టపడిందే చదవండి : సీఎం

వర్షాలు లేక గ్యాస్‌ లేక కుంటుపడిన ఉత్పత్తి మంత్రి గీతారెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి): విద్యుత్‌ ఆదాకు ప్రతి ఒక్కరూ సహకరించండి.. ఒక యూనిట్‌ను ఆదా చేస్తే 1.2 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్టేనని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కు మార్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాడు రవీంద్ర భారతిలో రాజీవ్‌ అక్షయ ఉర్జా దివాస్‌ జరిగింది. మంత్రులు ముఖేష్‌గౌడ్‌, సారయ్య, ప్రసాద్‌, గీతారెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. సభకు భారీ సంఖ్యలో విద్యార్థులు విచ్చేశారు. విద్యార్థుల నుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య ఉన్నమాట వాస్తవమేనన్నారు. వర్షాల వల్ల.. గ్యాస్‌ కొరత వల్ల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గడంతోను.. వినియోగం పెరగడంతోను విద్యుత్‌ కష్టాలు తీవ్రమయ్యాయన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లు చేద్దామంటే ఎక్కడా లభ్యంకావడం లేదన్నారు. విద్యుత్‌ను ఆదా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఒక్కో యూనిట్‌ ఉత్పత్తి చేసేందుకు, సరఫరా చేసేందుకు గాను రూ.4.20 పైసలు ఖర్చు అవుతోందన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తిలో 20 శాతం తగ్గుదల ఉందన్నారు. జలవిద్యుత్‌ ఉత్పత్తి 30 మిలియన్‌ యూనిట్లు, గ్యాస్‌ ద్వారా 20 మిలియన్‌ యూనిట్ల మేర ఉత్పత్తి తగ్గిందన్నారు. మొత్తం 50 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్‌ కష్టాలు తీవ్ర మయ్యా యని అన్నారు. ఈ ఏడాది 28 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని, అయినప్పటికీ లోటు కొనసాగుతుందన్నారు. రానున్న రోజుల్లో గాలి నుంచి, విల్‌ పవర్‌ నుంచి జనరేట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ నున్నట్టు చెప్పారు. టీవీని రిమోట్‌తో నిలిపివేయడం కాకుండా స్విచ్‌ కూడా ఆఫ్‌ చేస్తే ఒక యూనిట్‌ విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. జంట నగర వాసులు ఈ విధానాన్ని పాటిస్తే ఒక్క రోజుకే పది శాతం మేర విద్యుత్‌ను ఆదా చేసిన వారవుతారని తెలిపారు.
ఇష్టపడి చదవండి
చదువు ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అంతేకాని ఉద్యోగం కోసమో, మరి దేనికోసమో కాదని ముఖ్యమంత్రి కిరణ్‌ చెప్పారు. ఇష్టపడిందే చదవాలని.. దానికి కష్టాన్ని జోడించాలని సూచించారు. కష్టపడి .. ఇష్టపడి చదవడంవల్ల జీవితంలో ఎదిగేందుకు వీలవుతుందన్నారు. గెలుపోటములు సహజమని భావించాలన్నారు. ఒకరికి మార్కులు ఎక్కువ వచ్చాయనో, మరొకరికి మార్కులు తగ్గాయనో అనుకోవడం పొరపాటని, తక్కువ వస్తే కష్టపడి మరిన్ని మార్కులు సంపాదించే దిశగా కృషి చేయాలని కోరారు. అంతేకాని లేనిపోని ఒత్తిళ్లకుగురైతే జీవితం నిరర్థకం అవుతుందని చెప్పారు. అలాగే క్రీడలపై కూడా దృష్టి సారించాలన్నారు. అన్ని స్కూళ్లలోనూ ప్రతిరోజూ స్పోర్స్ట్‌ పిరియడ్‌ను అమలుచేయాలని జీఓ జారీ చేశామని చెప్పారు. క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందన్నారు. అంతేకాక కష్టపడే తత్వం కూడా పెంపొందుతుందన్నారు. ఆత్మవిశ్వాసం మరింత వృద్ధి చెందుతుందన్నారు. ఏఏ రంగంలో రాణించాలో, ఏ రంగమంటే ఇష్టమో దానిపైనే దృష్టి పెట్టాలన్నారు. లక్ష్యం దిశగా అడుగులు వేయాలన్నారు. అంతేకాని ఎవరో సూచించారనో, ఎవరో ఏదో సాధించారనో సలహాలు, మాటలు వినవద్దని సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఆడ పిల్లలు చదువు కోవడం వల్ల ఆర్థికాభివృద్ధి మరింత ముందుకు సాగుతుందన్నారు. రాజీవ్‌గాంధీ యువతకు పెద్దపీట వేశారన్నారు. ఆయన సేవలు యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు కల్పించిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందన్నారు. ఇదిలా ఉండగా తొలుత భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి మాట్లాడారు. రాజీవ్‌గాంధీ యువతకు అందించిన సేవలు అపూర్వమన్నారు. ఆయన ప్రవేశపెట్టిన విధానాల వల్లే గ్రామీణ స్థాయికి ఇంటర్నెట్‌, సెల్‌ ఫోన్‌ సౌకర్యం చేరుకుందన్నారు. ప్రతి ఇంటికి కంప్యూటర్లు చేరడం ఆయన చలువేనన్నారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్‌దేనన్నారు. దాన్ని 50 శాతానికి పెంచుతూ సోనియా గాంధీ మహిళలకు మరింత పెద్దపీట వేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షాలు లేక, గ్యాస్‌ ఉత్పత్తి లేక ఉత్పత్తి తగ్గడం వల్ల కష్టాలు చుట్టుముట్టాయన్నారు. ఇంధనం ఆదా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అవసరం మేరకే ఏసీ, గీజర్‌, ఫ్యాన్లు వినియోగించుకోవాలని కోరారు. ఎంతో కొంత విద్యుత్‌ ఆదా చేసేందుకు నేటి నుంచే కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తికి పెద్దపీట వేయనున్నట్టు చెప్పారు.