వినియోగదారులకు కల్తీలేని పెట్రోలు అందించండి

– ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం
– డీలర్లకు జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశం
శ్రీకాకుళం, జూన్‌ 28 : వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలని పెట్రోల్‌, గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(జేసి) పి.భాస్కర్‌ ఆదేశించారు. కల్తీ లేని పెట్రోలును సరఫరా చేయాలన్నారు. పెట్రోల్‌ నాణ్యతపై జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులున్నాయని, దీనిని సరిదిద్దుకోవాలని జేసీ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పెట్రోల్‌, గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. పెట్రోల్‌ డీలర్లకు సంబంధించి 83 మంది హాజరుకావాల్సి ఉండగా సుమారు 30 మంది హాజరు కాకపోవడంపై డిఎస్‌వోను ప్రశ్నించారు. సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. పెట్రోల్‌ బంకుల వద్ద వినియోగదారునికి కల్పించాల్సిన సౌకర్యాలన్నీ విధిగా ప్రదర్శించాలని ఆయన తెలిపారు. ఇది తొలి సమావేశం అయినందున సూచనలు చేస్తున్నామని, మరో 45 రోజుల్లో రెండో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ లోగా కొన్ని బ్యాంకులను ఆకస్మికంగా తనిఖీ చేస్తామన్నారు. డీలర్లలో మార్పు రాకుంటే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్యాస్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా ప్రత్యేకంగా దృష్టిసారించుకోవాలని డీలర్లకు జేసీ ఆదేశించారు. వినయోగదారుల నుంచి ఫిర్యాదులు రాకుండా పంపిణీ వ్యవస్థ ఉండాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆహార సంఘ సమావేశంలో పెట్రోల్‌, గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. వినియోగదారుల సేవలకు ఉద్దేశించిన కమిటీల సమావేశాలు ఆయా సమయాల్లో తప్పనిసరిగా నిర్వహించాలని డీఎస్‌ఓకు జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ కె.నిర్మలాభాయి, పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ మార్కెండేయులు తదితరులు పాల్గొన్నారు.