విశాఖ నగరంలో పచ్చదనం పరవళ్లు

– ఐదేళ్లలో 40 లక్షల మొక్కల పెంపకం
విశాఖపట్నం, జూన్‌ 27 : నగర పరిధిలో ఐదేళ్ల కాలవ్యవధిలో 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు మాసాంతానికల్లా 8లక్షల మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవుల పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ సుబ్బరామిరెడ్డి కంపెనీలను ఆదేశించారు. ఇప్పటికే ఒకలక్ష మొక్కలు నాటే కార్యక్రమం జరుగుచున్నదని, మిగిలిన ఏడు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జులై మొదటి వారం నుంచి ప్రారంభించి ఆగస్టు మాసాంతానికల్లా పూర్తి చేయాలన్నారు. ఏడాదికి ఎనిమిది లక్షల మొక్కలు నాటేందుకు సుమారు రూ.150 కోట్లను వెచిచస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమవేశమై మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్‌ పర్సన్‌ జానకి ఆర్‌.కొండపి, జిల్లా కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌, వుడా ఉపాధ్యక్షులు కోనా శశిధర్‌ పాల్గొన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత దేశ చరిత్రలోనే కాలుష్య నియంత్రణకు తొలిసారిగా విశాఖ నగరంలో ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ఎంతో ముదావహం అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కంపెనీలు పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందించాలని, సహకరించని కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో వెనుకాడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు కంపెనీలు తగు చర్యలు తీసుకోవడం వెనకాడే ప్రసిక్తి లేదని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు కంపెనీలు తగు చర్యలు చేపట్టడమనేది చట్టపరమైన బాధ్యతే కాకుండా నైతిక బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఒకలక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థలైన సింహాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ పోర్టు ట్రస్టు, హెచ్‌పిసిఎల్‌ మంచి ఫలితాలను సాధించాయని, మొక్కల మనుగడ శాతం కూడా బాగానే ఉందన్నారు. మిగిలిన ఏడు లక్షల మొక్కలు నాటేందుకు 19 కంపెనీలకు లక్ష్యాలను నిర్థేశిస్తూ, సంబంధిత స్థలాలను కూడా కేటాయించడమైందన్నారు. ఆయా కంపెనీల యాజమాన్యం ఈ మొక్కలు నాటే కార్యక్రమంపై వారి సమగ్ర ప్రణాళికలను రూపొందించి వుడా ఉపాధ్యక్షులకు వెంటనే నివేదించాలని ఆదేశించారు. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సంజాయిషీ కోరుతూ తాఖీదు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్‌పర్సన్‌ జానకి ఆర్‌.కొండపి మాట్లాడుతూ, కాలుష్య సమస్య అనేది అతి భయంకరమైనదని, దాని నియంత్రణకు కంపెనీలు తప్పని సరిగా సహకరించాలన్నారు. సహకరించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఆమె హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ నగర పరిధిలో నున్న 20 లక్షల జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికి రెండు మొక్కలు చొప్పున మొత్తం 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని కంపెనీలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. ఏడు లక్షల మొక్కలు నాటేందుకు 19 కంపెనీలకు లక్ష్యాలను నిర్థేశిస్తూ, సంబంధిత స్థలాలను కూడా కేటాయించడమైందని, వర్షాకాలం ప్రారంభమవుతున్నందున వెంటనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన కోరారు. రామ్‌కీ ఫార్మసిటీ కంపెనీకి లక్ష్యముగా నిర్థేశించిన 50వేల మొక్కలను నాటే కార్యక్రమంపై ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను వుడా విసికి సమర్పించాలని ఆ కంపెనీ ప్రతినిధిని ఆయన కోరారు. వుడా ఉపాధ్యక్షులు కోనా శశిధర్‌ మాట్లాడుతూ, మొక్కలునాటే కార్యక్రమంలో నిర్ణీత ప్రమాణాలను పాటించాలని లేకుండా సర్వైవల్‌ శాతం చాలా తక్కువగా ఉంటుందన్నారు. మొక్కటు నాటే కార్యక్రమంలో లోయస్టు టెండర్లను ఖరారు చేయడమే ముఖ్య ఉద్దేశ్యం కాకుండా నిర్ణీత ప్రమాణాలను పాటించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై ప్రిలిమినరీ సమావేశాన్ని సంబంధిత అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో నేటి ఉదయం స్థానిక గేట్‌ వే హాటల్‌ ఛైర్మన్‌ నిర్వహించారు. కాలుష్య నియంత్రణా మండలి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఖాన్‌, సింహాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ హెచ్‌పిసిఎల్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో పాటు 19 ప్రైవేటు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.