వెన్నులో వణుకు పుట్టిస్తున్న సైకో..! కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో తనిఖీలు
నెల్లూరు, జూలై 27 : ఔను.. అందర్ని వణికిస్తున్నాడు.. జాలర్లు సైతం భయం భయంగా గడుపుతున్నారు. గురువారంనాడు భద్రాచలం-చెన్నయ్ బస్సులో ముగ్గుర్ని కిరాతకంగా హతమార్చి మరొకర్ని తీవ్ర గాయాలు పాల్జేసిన సైకో ఉదంతం జిల్లాలో భయానక వాతావరణాన్ని పుట్టించింది. నెల్లూరు-తమిళనాడు మధ్య భీములవారిపాలెం చెక్‌పోస్టు సమీపంలో గురువారం తెల్లవారుజామున ముగ్గుర్ని గుర్తు తెలీని వ్యక్తి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు జాగిలాలు అడుగడుగునా గాలింపు చర్యలు చేపట్టారు. 20 స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేసినట్టు ఎస్‌పి బివి రమణకుమార్ తెలిపారు. బస్సులోనే ముగ్గుర్ని విచక్షణా రహితంగా పొడిచి డ్రైవర్ సంఘటన నుంచి తేరుకుని బస్సు స్లో చేయగానే దూకి పరారైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా.. ఆ ప్రాంతం నెల్లూరు జిల్లా తడ మండలం తమిళనాడులోని ఆరంబాకం ప్రాంతం కావడంతో అటు తమిళనాడు పోలీసులు కూడా అంగుళం అంగుళం గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు ప్రతిరోజు సుమారు 1300 బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణీకులను చేరవేస్తుండగా.. నిందితుడు ఏ వాహనంలోనైనా పారిపోయి ఉంటాడా అనే అనుమానంతో రాష్ట్ర సరిహద్దుల్లో సైతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రెండు వారాల క్రితం పోలీసుల నుంచి తప్పించుకున్న కృష్ణాజిల్లాకు చెందిన సాంబశివరావు లేదా కేరళలో ఇటీవల పలువుర్ని హత్య చేసిన ఆంటోనీ అనే సైకో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. సాంబశివరావును పట్టుకునేందుకు సెర్చీ పార్టీల్లో కావలి పోలీసుస్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ను ఎస్‌పి స్వయంగా విచారించి సాంబశివరావు ముఖకవళికలను, శరీర కృతిని తెలుసుకున్నారు. దీన్ని బట్టి నిందితుడు సాంబశివరావు, ఆంటోనీ కాదని బీవీ రమణకుమార్ అధికారికంగా ప్రకటించారు. అయితే పాతకక్షల నేపథ్యంలో ఎవరైనా ఈ హత్యలకు తెగబడ్డారా అని ఆలోచిస్తున్నారు. ఆ దిశగా కూడా దర్యాప్తు సాగించారు. అయితే ఒడిస్సాలోని మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన అజయ్ బిశ్వాల్ అనే వ్యక్తికూడా ఈ సంఘటనలో మరణించారు. దీన్ని బట్టి పాతకక్షలు కావని, సైకో పనేనని మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, జిల్లా ఎస్‌పి నుంచి పూర్తిగా వివరాలు సేకరించారు. నిందితులను వెంటనే పట్టుకోవాల్సిందిగా పలుమార్లు ముఖ్యమంత్రి జిల్లా కలెక్టరుకు సైతం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసుల వేట మొదలైంది. నెల్లూరు జిల్లాలో 950 గ్రామాలు ఉండగా వీటిల్లో ఎక్కడైనా తలదాచుకున్నాడా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అటవీ ప్రాంతాలైన ఉదయగిరి, రాపూరు, సీతారామపురం, పెంచలకోన, భైరవకోన ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. కాగా సైకో వార్త జిల్లాలో దావానలంలా వ్యాపించడంతో భయోత్పాతానికి గురైన ప్రజలు అనుమానితులను పట్టుకుని కొట్టడం.. పోలీసులకు అప్పగించడం ఈ సంఘటనలతో శాంతిభద్రతల సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ హత్యోదంతం జరిగిన రెండు గంటలలోనే గత రాత్రి నెల్లూరు రూరల్ మండలంలోని ముత్యాలంపాడు ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు. తీరా చూస్తే అతడు మతిస్థిమితం లేని వ్యక్తి అని తేలింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం తమిళనాడు నుంచి ఉన్నత పోలీసు అధికారుల బృందం నెల్లూరు జిల్లాకు రానున్నది. నెల్లూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన ఆరంబాకం, సమీపంలోని సముద్రతీరంలో గల జాలర్ల కుప్పాలలో గాలింపు చర్యలకు ఆంధ్ర, తమిళనాడు పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్నారు. మొత్తం మీద సైకో ఉదంతం జిల్లాలో భయోత్పాతాన్ని కలిగించగా నగరాలు… పట్టణాల్లోని నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు నిన్న మధ్యాహ్నం నుంచి వెలవెలబోతున్నాయి. ఆటోల్లో సైతం ప్రయాణించడానికి ప్రజలు విముఖత చూపుతుండగా నగరంలోని అనేక కూడళ్లల్లో పోలీసులు వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. త్వరలో సైకోను పట్టుకుంటామన్న ధీమాను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.