ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం

డిసెంబర్ 3 (జనం సాక్షి):ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన దాదాపు వెయ్యి మంది ప్రయాణికులు రాత్రి నుంచి ఎయిర్‌పోర్టులోనే ఎదురుచూస్తూ ఉండిపోయారు
తెల్లవారుజామున రెండు గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానాన్ని దాదాపు రెండు గంటల పాటు నిలిపివేశారు. ఏమైందని ఇండిగో సిబ్బందిని ప్రయాణికులు ప్రశ్నించినప్పటికీ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. ఎంతసేపటికీ విమానం కదలకుండా అలాగే రన్‌వేపై ఆపడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో చేసేదేమీ లేక వారిని తిరిగి ఎయిర్‌పోర్టులోకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి నుంచి వారు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. బెంగళూరుతో పాటు ముంబై, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాల్లోనూ అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు వెయ్యి మంది వరకు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే తమ జర్నీ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్సయ్యామని ఆవేదన చెందారు. వీసా ఇంటర్వ్యూల కోసం, ఇతరత్రా పనుల మీద వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ఇండిగో తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.



