దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం

డిసెంబర్ 3 (జనం సాక్షి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు మనందరం ప్రతినబూనుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలను తీసుకొచ్చామని గుర్తుచేశారు.
కేసీఆర్ ఆనాడు మానవత్వంతో కూడిన పరిపాలన అందించారని కేటీఆర్ తెలిపారు. దివ్యాంగులకు అత్యధికంగా రూ.4016 పెన్షన్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఒక ఆసరా పెన్షన్ ద్వారానే దాదాపు రూ. 10 వేల కోట్లు అందించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 3% నుంచి 4% శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా అనేకమందికి సహాయ ఉపకరణాలు ఉచితంగా అందించామన్నారు. కానీ, అధికారం కోసం దివ్యాంగులకు రూ.6 వేల ఫించను, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, బాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ లాంటివి ఆశ చూపి రెండేళ్లు అవుతున్నా దానిని అమలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ దివ్యాంగుల హక్కుల కోసం నిరంతరం నినదిస్తుందని, సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తుందని భరోసా ఇచ్చారు.



