వైఎస్‌ చిత్రపటాలపై కాంగ్రెస్‌లో దుమారం!

జగన్‌ అస్మదీయులపై అధిష్టానం ఆరా..
చీలిక వైపు అధికార పక్షం?
హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్ర పటాలు నేడు వివాదాస్పదమవుతున్నాయి. వైఎస్‌ పేరును ప్రజల మదిలోంచి తుడిచివేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుండగా, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకులు పార్టీ శ్రేణులు మాత్రం వైఎస్‌ బొమ్మ పెట్టాల్సిందేనన్న అభిప్రాయంతో ముందడుగు వేస్తున్నారు. మంగళవారం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్‌ బొమ్మ పెట్టకపోవడంపై వైఎస్‌ ఆత్మబంధువుగా పేరున్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ తీవ్రంగా స్పందించారు. వైఎస్‌ ప్రజల గుండెల్లో ఉన్నారని, రాహుల్‌ గాంధీని ప్రధానిగా చేసేందుకు ఆయన కృషి చేశారంటూ వేదికపైనే కంటతడిపెట్టడం వివాదాస్పదంగా మారింది. కేవీపీ జగన్‌ ఏజెంటుగా కాంగ్రెస్‌లో ఉన్నారంటూ ఆయనపై ఆరోపణల వర్షం కురుస్తోంది. కేవీపీ చేసిన వ్యాఖ్యలపై కొందరు తటస్థంగా మాట్లాడగా, మధుయాస్కీ, వి. హనుమంతరావు, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వంటి వారు నిప్పులు చెరిగారు. వైఎస్‌ హయాంలో జరిగిన అవినీతికి కేవీపే బాధ్యుడని ఆయన జగన్‌ కోవర్ట్‌ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వైఎస్‌కు పెద్ద ప్రత్యేకత లేదని, మాజీ ముఖ్యమంత్రుల కోవలోకే ఆయన వస్తారని, మాజీ సీఎంల ఫొటోలు పెట్టుకుంటేపోతే అంజయ్య మొదలు అందరి ఫొటోలు పెట్టాలంటూ డిమాండ్‌ చేశారు. వీహెచ్‌ గురువారం ఈ విషయంపై మరీ ముందుకు వెళ్లారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా వైఎస్‌ బొమ్మను తీయాల్సిందేనని, లేకపోతే ప్రజలే ఆ ఫొటోను తీసేస్తారంటూ మండిపడ్డారు. జగన్‌ సోనియా గాంధీని తీవ్రంగా ధూషించిన సమయంలో కేవీపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దీంతో వివాదం మరీ ఎక్కువైంది. రాష్ట్రంలోని పలువురు మంత్రులు ఇప్పటికీ జగన్‌ వైపే మంత్రులు ఉన్నారని, వారు భవిష్యత్తులో వైఎస్సార్‌ సీపీలోకి వెళ్లడం ఖాయమంటూ మాజీ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌ బాబు చేసిన వ్యాఖ్యలు అధిష్టానం దాకా వెళ్లాయి. సోనియా గాంధీ కూడా ఈ విషయంలో విచారణ చేయాలంటూ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులకు మౌఖిక ఆదేశాలు పంపినట్టు సమాచారం. వైఎస్‌ చిత్ర పటం వివాదం చినికిచినికి గాలివానగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జగన్‌కు అనుకూలంగా ఉన్న నాయకుల పేర్లను చెప్పించుకునేందుకు అధిష్టానం సిద్ధపడుతుండడంతో చీలిక వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టు రాజకీయ వర్గాల విశ్లేషణ.