వైఎస్‌ నీడ సూరీడు ఏం చేస్తున్నారు?

హైదరబాద్‌, జూలై 6 (జనంసాక్షి): ఒకప్పుడు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడు ఒక వెలుగు వెలిగారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడికి పెద్ద ఇమేజే ఉండేది. ఎవరికి వారు సూరీడుతో సంబంధాలు పెట్టుకోవడానికి, ఆయనను కలవడానికి ప్రయత్నించేవారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంతో ఒక్కసారిగా ఆయన జాతకం మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. సూరీడు ఇప్పుడు ఖాళీడానే ఉన్నారట. తాజాగా, ముఖ్యమంత్రికిరణ్‌కుమార్‌రెడ్డిని కలవడానికి వచ్చి ఓసారి వార్తల్లోకి ఎక్కాడు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనుక నిలబడి, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అయితే ఆయన గురించి పెద్దగా వార్తలు రావడంలేదు. అయితే ఖాళీగా ఉండడానికి సూరీడు ఏ మాత్రం ఇష్టడడం లేదని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు దగ్గర కావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. అధిష్టానం పెద్దలు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా వారిని కలవడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి వాయలార్‌ రవి పలు మార్లు హైదరాబాద్‌కు వచ్చారు. వాయలార్‌ రవిని సూరీడు కలుసుకుని నమస్కారం చేశారట. ఆ వెంటనే వాయలార్‌ రవి సూరీడుతో కాసేపు ముచ్చటించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రణబ్‌ముఖర్జీ కూడా హైదరాబాద్‌ వచ్చారు. ఆ సమయంలో కూడా సూరీడు ప్రణబ్‌ ముఖర్జీకి కనిపించారని అంటున్నారు. ఏమైనా, సూరీడు మౌనంగా ఉండడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.