వైద్య రంగంలో యువతకు ఉపాధి

శ్రీకాకుళం, జూన్‌ 27 : వైద్య రంగంలో యువతకు సంమృద్ధిగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని జివికె ఈఎంఆర్‌ఐ సంస్థ మానవవనరుల ప్రతినిధి శ్రీనివాసరావు అన్నారు. ఎచ్చెర్లలోని మహిళా ప్రగతి కేంద్రంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రాజీవ్‌ యువకిరణాల కార్యక్రమంలో భాగంగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి భావవ్యక్తీరణ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం అభివృద్ధి చేసుకుంటే ఈ రంగంలో మంచి ఉపాధి లభిస్తుందన్నారు. ఎమర్జెన్సీ రూమ్‌ టెక్నీషియన్‌(ఈఆర్‌టీ) ఉద్యోగాలకు లైఫ్‌సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులను తీసుకుంటామన్నారు. వీరికి హైదరాబాద్‌లో మూడునెలల పాటు శిక్షణ ఇచ్చి అనంతరం స్థానికంగా ఎనిమిది వేల రూపాయల వేతనంతోపాటు భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులను హాస్పటల్‌ అడ్మినిస్ట్రేటర్లగా కార్పొరేటు ఆసుపత్రుల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. వీరికి నెలకు రూ. 8వేల వేతనం, ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తారన్నారు. ఈఆర్‌టీ ఉద్యోగానికి లైఫ్‌సైన్స్‌ కోర్సుల్లో డిగ్రీ ఉత్తీర్ణులై 107 మంది హాజరుకాగా రాత పరీక్ష, ఇంటర్వ్యూలు చేపట్టి 63 మందిని ఎంపిక చేశారు. వీరికి చివరిగా మరో మారు మౌఖిక పరీక్ష నిర్వహించి తుది ఎంపిక జాబితా వెల్లడిస్తామన్నారు. హాస్పటిల్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఉద్యోగాలకు 159 మంది హాజరుకాగా 92 మంది రాతపరీక్షలో అర్హత సాధించారు. వీరికి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు 12 మంది హాజరుకాగా 12 మందిని ఎంపిక చేశారు. వీరికి కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగం కల్పిస్తారు. నెలకు రూ. 7,500 వేతనం, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఇందిరా క్రాంతి పథం జిల్లా జాబ్స్‌మేనేజర్‌ రాజ్‌కుమార్‌, ఏపీఎం రజని, ప్లేస్‌మెంట్‌ అధికారి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.