వైద్య, విజ్ఞాన సదస్సును ప్రారంభించిన ఎంపీ

కరీంనగర్‌, నవంబర్‌ 7 : విద్యా, వైద్య విజ్ఞానంలో మార్పులు జరిగితే విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభా పాటవాలు పెరుగుతాయని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. జగిత్యాలలోని మానస హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన విద్యా, వైద్య విజ్ఞాన సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విజ్ఞానం వల్ల విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలు పెంపొందుతాయని అన్నారు. విద్యా విధానంలో గణనీయమైన మార్పులు జరిగిన నాడే విద్యా వ్యవస్థ అనుకున్న మెరకు అధికమిస్తుందని ఆయన అన్నారు. కలెక్టర్‌ సబర్వాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఒక్క పాఠశాలలో కంప్యూటర్‌ విజ్ఞానాన్ని ప్రవేశపెడతామని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కంప్యూటర్‌ విజ్ఞానాన్ని పొందవచ్చునని అన్నారు. విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులు విద్య పట్ల మరింత ఆసక్తిని కనబరుస్తారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌ రావు, జగిత్యాల ఆర్డీవో హనుమంతరావు విద్యాధికారులు పాల్గొన్నారు.