శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లు
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రతిపాదించారు. దీనిపై శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్చ జరుగుతుంది. బిల్లు ప్రతిపాదన సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను ఆయా ప్రభుత్వాలు సక్రమంగా ఖర్చు చేయలేదని, ఈ నిధులు ఇతర రంగాలకు దారిమళ్లాయని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధులను తమ ప్రభుత్వం వీరి సంక్షేమం కోసం ఖర్చు చేయడం లేదని, అందుకే ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ ఏర్పాటైందని తెలిపారు. 1975-76లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎస్సీ,ఎస్టీలకు ఉప ప్రణాళిక వేసినట్లు చెప్పారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైందని, ఈ బిల్లు తీరుతెన్నులను సభకు వివరిస్తానని కిరణ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉపసంఘం కూడా నిర్ణీత కాలపరిధిలో నివేదిక అందజేసిదన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చగానే ఆర్థిక సంవత్సరం నుంచే ఈ చట్టం అమలవుతుందన్న ముఖ్యమంత్రి ఇకపై నిధుల దారిమళ్లింపుకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. గత మార్చి నెలలో ఇచ్చిన హామీ మేరకే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక వేశామన్నారు. ఇకపై ప్రతి ఏటా ఈ బిల్లుపై సామాజిక తనిఖీ ఉంటుందన్నారు. ఇదిలాఉండగా అంతకుముందు ఎంఐఎం ఇచ్చిన వాయిదా తీర్మాణాన్ని సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తర్వాత సభ శనివారానికి వాయిదా పడింది.



