సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయాలు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఇవాళ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది, ఈ సమావేశానికి టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హాజరయ్యారు. సచివాలయం ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ నరేందర్‌రావు సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యలు, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. తెలంగాణ కోసం ఉద్యమించే వారికే తమ మద్దతు ఉంటుందని జేఏసీ నేతలు చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు పోరాటం ఆపేదిలేదని తేల్చి చెప్పారు. తెలంగాణ కోసం జెండాలను ఎజెండాలను పక్కన బెట్టి పోరాటం చేయాలని వారు రాజకీయ పార్టీలకు సూచించారు. తెలంగాణ కోసం పోరాడకుండా తెలంగాణపై డొంక తిరుగుడు మాటలు మాట్లాడితే  సహించేది లేదని నరేందర్‌రావు హెచ్చరించారు. తెలంగాణపై తెలంగాణ ప్రాంత మంత్రుల వైఖరి, కార్యాచరణ ఏంటో చెప్పాలపి ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని నరేందర్‌రావు హెచ్చరించారు. తమ ప్రాంత ఉద్యోగుల సమస్యలపై ఈనెల 19న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వివరించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.