సమాజాన్ని సమూలంగా మార్చేందుకు

కార్మికులు ఐక్యం కావాలి : ఏఐటీయూసీ
హైదరాబాద్‌లో శ్రామిక గర్జన
హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) :
సమాజాన్ని సమూలంగా మార్చటానికి కార్మిక సంఘాలు బలమైన ఆయుధాలని, ఇందుకు త్వరలో జరిగే మరో సార్వత్రిక సమ్మెకు కార్మిక లోకం సమాయత్తం కావాలని ఎఐటీయూసీ ఉప ప్రధాని కార్యదర్శి హెచ్‌ మహదేవ్‌ పిలుపినిచ్చారు. ఎఐటీయూసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్‌ వద్వ శ్రామిక జనగర్జన పేరుతో జరిగిన కార్మికుల మహా ధర్నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఐటీయూసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పీజీ చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి నారయణ, ఎఐటీయూసీ కార్యనిర్వహక అధ్యక్షులు టీ. నరసింహన్‌ ప్రధాన కార్యదర్శిజీ ఓబులేసు, ఉప ప్రధాన కార్యదర్శి బాలరాజు, కార్యదర్శి శివనాగ మల్లీశ్వరీ, ఎస్‌టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నర్ససింహరెడ్డిలు ప్రసంగించారు. తొలుత మహదేవ్‌ మాట్లాడుతూ రెండేళ్లుగా కేంద్ర కార్మిక సంఘాలు సమిష్టిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నాయని తెలిపారు. రెండు మార్లు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేసినప్పటికీ పాలకుల్లో స్పందన కరవైందని అందుకే మరోమారు కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలపునివ్వబోతున్నాయన్నారు. ఈ సారి ఒక రోజు కంటే ఎక్కువ రోజులు సమ్మె ఉండవచ్చని ఆయన సూచన ప్రాయంగా తెలిచజేశారు. ఇందులో పాల్గొనేందుకు ఘనమైన కార్మికొద్యమ చరిత్రను కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని సంఘటిత అసంఘటిత కార్మికులు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే ఎఐటీయూసీ అత్యంత పురాతనమైన కార్మిక సంఘామని, ఇది ఏర్పడి 92 సంవత్సారాలు అవుతున్నాయన్నారు. ఏఐటీయూసీ పోరాట ప్రస్థానంలో కార్మికుల సంక్షేమానికి అనేక చట్టాలను సాధించిందన్నారు. అయితే వాటిలో కొన్ని సర్వత్రా అమలు కావడం లేదని, అందులో ప్రసూతి సెలవుల చట్టం కనీస వేతన చట్టం అసంఘటిత కార్మికుల సంక్షేమ చట్టం కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ రద్దు చట్టం అని ఆయన ఉదహరించారు. దేశంలోని అత్యున్నత స్థానాలైన రాష్ట్ర పతి పదవి, పాలక పార్టీ అధ్యక్ష పదవి, లోక్‌సభ ప్రతిపక్ష నేత పదవిలో మహిళలు ఉన్నప్పటికీ శ్రామిక మహిళలు సమాన వేతనం కోసం పోరాడడం ఘోరమన్నారు. 1957లో కనీస వేతనం నిర్ధారణకు ఏర్పాటైన త్రైపాక్షిక కమిటీ కొన్ని ప్రమాణాలను సూచించిందన్నారు. దాని ప్రకారం హైదరాబాద్‌లో పనిచేసే ఏ రంగంలోని కార్మికులైన ఈ రోజుల్లో రూపాయలు కనీస వేతనంగా రావాలని, కాని అదెక్కడా అమలు జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతన రూపాయలు 10 వేలకు తక్కువ కాకుండా ఉండాలని ఏఐటీయూసీ పోరాడుతుందని అన్నారు. 1996లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ల నుంచి లెవీ వసూలు చేస్తున్నప్పటికీ ఆ నిధులు దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. ఇటీవల ఈ అంశంపై వేసిన కేసుపై విచారణ జేస్తున్న సుప్రీం కోర్టు ఈ చట్టం కింద భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఏటా చెందాల్సిన రూపాయలు 10 వేల కోట్లు నష్టపోతున్నారని వ్యాఖ్యానించిందన్నారు. ఈ మధ్య కాలంలో పరిశ్రమల ఉత్పత్తికి లాభాలు విపరీతంగా పెరిగితున్నప్పటకీ అందులో పనిచేసే పర్మినెంట్‌ కార్మికుల సంఖ్య తగ్గిపోతుందన్నారు. ఇందుకు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కార్మికులను నియమించుకోవడమే కారణమని, వారికి ఉద్యోగ భద్రత, సౌకర్యాలు ఉండవని చెప్పారు. పర్మినెంట్‌ కార్మికుడికి సమానమైన పని క్యాజువల్‌, ఇతర కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలని, పిర్మనెంట్‌ చేయాలని కాంట్రాక్టు లేబర్‌ నిర్మూలన చట్టం చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ శాఖల్లోనే అది అమలు కావడం లేదన్నారు. 1991 నుంచి ఇప్పటి వరకు ఆధునిక దేవాలయాలుగా పేర్కొనబడే ప్రభుత్వరంగ సంస్థల టర్నోవర్‌ 12రెట్లు పెరిగిందని, అదే స్థాయిలో విదేశీ మారకం, ఆదాయం పెరిగిందని, గత ఏడాది రూ. 1, 55, 000కోట్లు ఆర్థిక వ్యవస్థకు తన వంతుగా అందించాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపై ఏఐటీయూసీ పోరాడుతుందని వివరించారు. ఇంకా రోజుకు 8గంటలకు మించి పని చేయించరాదనే చట్టాన్ని అమలు చేయాలని, ఇంకా దానిని 6గంటలకు తగ్గించాలని, నిత్యావసర ధరలను తగ్గించాలని మహదేవన్‌ డిమాండ్‌ చేశారు. మహాదేవన్‌ ప్రసంగాన్ని టి.నరసింహన్‌ తెలుగులోకి అనువదించారు.
నారాయణ మాట్లాడుతూ కార్మికులకు రాజ్యంగం కల్పించిన కార్మిక సంఘాల ఏర్పాటు, కనీస వేతన చట్టం వంటివి అమలు చేయని సంస్థలు, పరిశ్రమలు యజమానులు, వాటిని పర్యవేక్షించని ప్రభుత్వ అధికారులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.