సమైక్యవాదానికి ‘కొండ’అండ

పరకాల, జూన్‌ 5 (జనంసాక్షి) : పరకాల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సీమాంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్నారని, దీనికి సమైక్యవాది జగన్‌ పార్టీ నుంచి ఆమె బరిలోకి దిగడమే సాక్ష్యమని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. మంగళవారం పరకాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పరకాలలో తమ పెత్తనాన్ని నిలుపుకోవడానికి దౌర్జన్యానికి కూడా వెనుకాడడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు, రైతులకు విత్తనాలు, పిల్లల చదువులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర సమస్యలపై ఏనాడు గొంతెత్తని కొండా సురేఖ సమైక్యవాదులకు ప్రయోజనం కలిగించేలా ప్రవర్తిస్తున్నదన్నారు. సమైక్యవాదానికి మద్దతుగా పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టిన జగన్‌ కోసం రాజీనామా చేసిన సురేఖ నేడు ఓట్లకు కక్కుర్తి పడి తెలంగాణ కోసం రాజీనామా చేశానని చెబుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఆమెకు ఒకవేళ తెలంగాణపై కొంచెమైనా ప్రేముంటే ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేది కాదని వివరించారు. పైకి ‘జై తెలంగాణ’ అంటూ, లోపల సమైక్యవాదం నిండిన కొండా సురేఖను
గెలిపిస్తే, సీమాంధ్రులు యథేచ్ఛగా తెలంగాణలోకి చొరబడడానికి అవకాశమిచ్చినట్లవుతుందని తెలిపారు. కాబట్టి, సురేఖను కచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరమున్నదని కోదండరాం పునరుద్ఘాటించారు. అందుకే, కొండా సురేఖను ఓడించి, తెలంగాణవాదాన్ని కాపాడుకోవాలని ఆయన పరకాల నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు హక్కుతోనే మనం మన ప్రయోజనాలను కాపాడుకోగలుగుతామని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. ప్రస్తుత పరకాల ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ తెలంగాణవాదాన్ని వినిపిస్తున్నాయని, ఈ రెండింటిలో దేనికి ఓటు వేయాలన్న దానిపై ప్రజల్లో చర్చ అవకాశముందని కోదండరాం అభిప్రాయపడ్డారు. అందుకే జేఏసీ ఆధ్వర్యంలో పరకాలలో ఏ తెలంగాణ పార్టీ బలంగా ఉందో తెలుసుకోవడానికి సర్వే జరిపామని తెలిపారు. ఈ సర్వేలో క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ పార్టీయే బలంగా ఉందని వెల్లడైందని, ఆ ప్రజాభిప్రాయం మేరకే జేఏసీ టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిందన్నారు. అంతేగానీ, బీజేపీ ఆరోపిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ఒత్తిడికి లొంగాల్సిన అవసరం జేఏసీకి లేదన్నారు. జేఏసీ అభిప్రాయాన్ని గౌరవించి, పరకాలలో బలంగా ఉన్న, తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని కోదండరాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.