సమ్మోహపరిచిన మాండొలిన్‌ శ్రీనివాస్‌ వాద్యం

హైదరాబాద్‌, జూన్‌ 11 : మాండొలిన్‌వాద్యంపై యువ కళాకారుడు, పద్మశ్రీ శ్రీనివాస్‌ ప్రదర్శించిన కర్ణాకట సంగీత స్వరఝరి కళాప్రియులను అలరించింది. నాదప్రభ కల్చరల్‌  ఆధ్వర్యంలో  శనివారం సాయంత్రం రవీంద్రభారతి వేదికపై శ్రీనివాస్‌ మాండొలిన్‌ వాద్య సంగీత విభావరి నిర్వహించారు. కచేరీలో ప్రధానాంశంగా కానడ రాగంలో వర్ణాన్ని ఎంచుకున్నారు. రాగంలోని స్వరసాహిత్యాలను  మృదుమధురంగా పలికించి ప్రేక్షకుల వృదయాలను దోచుకున్నారు. అనంతరం  హంసధ్వని రాగంలో పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్య రచించిన ‘వందేహం’ సంకీర్తనను రసరమ్యంగా ప్రదర్శించి   రాగంలోని జీవస్వరాలను ప్రదర్శించి సంగీత ప్రియులను అలరించారు. త్యాగరాజస్వామి రచించిన పంచరత్న  శ్రీరాగంలో కీర్తన ‘ఎందరో మహానుభావులు’  స్వరసాహిత్యాల కలయికతో శ్రుతిపక్వంగా ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను  చూరగొన్నారు. అనంతరం ముఖ్యాంశంగా తోడిరాగాన్ని ఎంచుకున్నారు. మంద్ర ,మధ్య, తార స్థాయిల్లో రాగాన్ని  తంత్రులపై విస్తరించి ప్రదర్శించి సంగీత పటిమను చూపి  రాగంలోని స్వరచ్ఛాయలను, జీవస్వరాలను  వీనులవిందుగా వినిపించారు.  ఇతర సంగీత రచనలను మాండోలిన్‌పై సుందరంగా, శ్రవణ పేయంగా శ్రీనివాస్‌ ప్రదర్శించి ఆహూతుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. ఇతర వాగ్గేయకారుల రచనలు  వాయించి ప్రేక్షకులను అలరించారు. కచేరీలో వయొలిన్‌పై వెంకటకృష్ణ, మృదంగంపై వంకాయల రమణమూర్తి, ఘటంపై హనుమంతరావు చక్కని వాయిద్య సహకారం అందించారు. మృదంగం, ఘటం కళకారులు తని అవర్తనంలో చూపిన ప్రతిభ సంగీత ప్రియులను ఓలలాడించింది.