సర్‌చార్జీలు ఎత్తివేయాలని 22న ఆందోళన

ఖమ్మం, జనవరి 19 : ఖమ్మం పట్టణంలోని విద్యుత్‌ సర్‌చార్జీలు ఎత్తివేయాలని, పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 22న ప్రదర్శన, కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్టు వామపక్షాల నాయకులు స్పష్టం చేశారు. 22న పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి భారీ ప్రదర్శన అనంతరం కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉంటుందని  సిపిఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అసమర్ధతతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు. గతంలో 10 వేల కోట్ల రూపాయల విద్యుత్‌ భారం ప్రభుత్వం మోపిందన్నారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి 18 కోట్ల భారం మోపేందుకు సిద్ధమవుతుందని విమర్శించారు. విద్యుత్‌ రంగానికి 34 వేల కోట్ల రూపాయలు అప్పులయ్యాయని సాకుగా చూపించి భారాలు మోపడం సరికాదన్నారు. ప్రభుత్వం దివాలాకోరు విధానాలతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజలపై మోపుతున్న భారాలను ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గత ప్రభుత్వం చార్జీలు పెంచి ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. సంస్కరణలు నిలిపివేయకపోతే పతనం తప్పదని ఆయన హెచ్చరించారు.