సాహితీరత్నం ‘సదాశివ’!

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): తెలంగాణ సాహితీ మాగాణంలో విరబూసిన పూవు.. సాహితీ సామ్రాజ్యంలో తనకంటూ ఒక మెరుపును సృష్టించుకున్న నిరాడంబరుడు సదాశివ మాస్టారు. భావి తరాలకు ఆయన ఆదర్శనీయుడు. ఆయన చేతి నుంచి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు జాలువారాయి. ఉపాధ్యాయుల, విద్యార్థుల ప్రశంసలను సైతం చూరగొన్న సరస్వతీపుత్రుడు. 1970లో ఐదో తరగతికి, 1980లో ఏడో తరగతికి తెలుగు పాఠ్య పుస్తకాలను రాసిన కలంయోధుడు. అంతేగాక కొమురంబీం గురించి పాఠం రూపొందించి సమాజానికి ఆయన చేసిన సేవలను విద్యార్థులకు బోధించిన తీరు శ్లాఘనీయం. ఆయన తన 60 ఏళ్ల జీవితంలో రచించిన వ్యాసాలెనో.. పుస్తకాలెన్నో.. 1963 నుంచి రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘం సభ్యునిగా సుమారు 20 ఏళ్ల పాటు సేవలందించారు. భాషలు వేరైనా భావమొక్కటే అని చాటిన వారిలో సదాశివ మాస్టారు ఒకరు. ఆయన బహుభాషా కోవిదుడు. నాలుగైదు భాషల్లోకి అనువాదం చేసిన ఘనుడు. అమ్మద్‌ రుబాయిలు అనే గ్రంథానికి 1964లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అనువాద రచనగా బహుమతి అందించింది. కేశవ్‌సుత్‌ అనే గ్రంథాన్ని ఇంగ్లీషు నుంచి అనువాదం చేసి తన ఘనతను చాటుకున్నారు. సదాశివ మాస్టారు ఉర్దూ వ్యాసాల ద్వారా కాళోజీ రామేశ్వరరావును లోకానికి పరిచయం చేశారు. 2006లో అప్పటి సిఎం రాజశేఖరరెడ్డి నుంచి ప్రతిభ రాజీవ్‌ పురస్కారం, తెలుగు సంస్కృతి వికాస వేదిక, తిరుపతి నుంచి 2007లో ఆత్మీయ పురస్కారం, 2008లో ధర్మనిధి సాహిత్య పురస్కారం, 2008లోనే ఆత్మీయ పురస్కారం, 2009లో ప్రతిభా పురస్కారం, 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందుకున్నారు. తను రచించిన స్వరలయలుకు 2012 ఫిబ్రవరిలో జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞతో విమర్శకులను సైతం మెప్పించగలిగిన మేరునగవు ఆయన.
తెలంగాణ మాగాణంలో సాహిత్యాన్ని పండించిన సామల సదాశివ ఇక లేరన్న విషయంతో తెలంగాణ సాహిత్య లోకం మాత్రమే కాదు.. ఆంధ్ర ప్రాంతంతో పాటు అటు తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వరకు ఉన్న ఆయన సాహిత్య మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉంటే మరో విషాద సంఘటనకు అందరి కంటా కన్నీరొలుకుతోంది. సామల సదాశివ సతీమణి సులోచన కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన కన్నుమూసిన విషయాన్ని ఎలా చెప్పాలో తెలీక కుటుంబ సభ్యులు, సుపుత్రులు సైతం గత 24 గంటలుగా నరకయాతన పడుతున్నారు. బుధవారంనాడు సామల సదాశివ మాస్టారు పార్దీవదేహానికి అంతిమసంస్కారం జరగనుంది. సదాశివ మాస్టారు 1928, మే 11న ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ సమీపంలోని తెనుగుపల్లెలో జన్మించారు. ఎంఎ, బిఇడీ చేసిన ఉపాధ్యాయునిగా పనిచేశారు. భద్రాచలం జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి 29 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. నాటి నుంచి నేటివరకు ఆదిలాబాద్‌ పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు.